Begin typing your search above and press return to search.

మరో రెండు ఆసుపత్రులపై వేటు తప్పదట.. ఈటెల ఫైర్

By:  Tupaki Desk   |   4 Aug 2020 5:38 PM GMT
మరో రెండు ఆసుపత్రులపై వేటు తప్పదట.. ఈటెల ఫైర్
X
గడిచిన కొన్నాళ్లుగా ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల తీరుపై చూసిచూడనట్లుగా ఉంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. నిన్నమొన్నటి వరకు ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల తీరు.. ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్న వైనంపై వరుసగా కథనాలు వస్తున్నా.. పెద్దగా పట్టించుకోనట్లుగా వ్యవహరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. నిన్నటికి నిన్న దక్కన్ ఆసుపత్రిపై వేటు వేసిన మంత్రి ఈటెల.. తాజాగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిప్పులు చెరిగారు.

కొవిడ్ లక్షణాలతో వచ్చే వారిని ఆర్ఎంపీలు చికిత్స చేయొద్దని చెప్పిన ఆయన.. కరోనా విషయంలో మొదట్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. జ్వరం.. దగ్గు.. జలుబు ఉందని లైట్ తీసుకోవద్దన్న ఈటెల.. ఫ్లూ లక్షణాలు ఉంటే ఆసుపత్రికి వెళ్లాలన్నారు. పీహెచ్ సీ స్థాయిలోనే కరోనా నిర్దారణ జరగాలన్న ఆయన.. ఫ్లూ లక్షణాల్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఊపిరితిత్తుల్లో గాలి లేకుండా చేయటమే కరోనా లక్షణంగా అభివర్ణించిన ఈటెల.. ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కరోనాకు చేసే వైద్యం ఖర్చు చాలా తక్కువన్న ఆయన.. రోజుకు వెయ్యి రూపాయిలు కూడా ఖర్చు కాదన్నారు. ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రుల మీద వందలాదిగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. కరోనా మానవ సంబంధాల్ని కూడా ధ్వంసం చేసిందన్న ఆయన.. మనిషి చనిపోయిన తర్వాత కూడా డబ్బుల కోసం వేధించటం అతి హీనమైన చర్యగా అభివర్ణించారు.

ఇప్పుడున్న పరిస్థతులు డబ్బులు సంపాదించే సందర్భం కాదన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల తీరు కళంకితంగా మారాయన్న ఆయన.. మరో రెండు ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. భయంతో కొందరు చనిపోతున్నారని.. ధైర్యంగా ఉండాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులను మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పామని.. అయినా వాటి తీరు బాగోలేదన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే చచ్చిపోతామన్న ప్రచారం సరికాదన్న ఆయన.. ప్రైవేటు ఆసుపత్రుల్లో చనిపోయే పరిస్థితుల్లో ఉన్న వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపుతున్న వైనాన్ని ప్రస్తావించారు. గడిచిన రెండు..మూడు రోజులుగా ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న ఈటెల.. ఇంత కాలం చూసిచూడనట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నట్లు..?