Begin typing your search above and press return to search.

కార్తీక్‌ వైదొలుగుతున్నట్టు నాకు ముందే తెలుసు.. కేకేఆర్​ కొత్త కెప్టెన్​ మోర్గాన్‌

By:  Tupaki Desk   |   17 Oct 2020 10:50 AM GMT
కార్తీక్‌ వైదొలుగుతున్నట్టు నాకు ముందే తెలుసు..  కేకేఆర్​ కొత్త కెప్టెన్​ మోర్గాన్‌
X
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్సీకి దినేశ్​ గుడ్​బై చెప్పడం.. ఆ ప్లేస్​కు మోర్గాన్ రావడం తెలిసిన విషయమే. అయితే దినేశ్​ వెళ్లిపోతున్నట్టు తనకు ముందే తెలుసని మోర్గాన్​ చెప్పాడు. కెప్టెన్​గా ఉండటం వల్ల తాను బ్యాటింగ్​పై దృష్టి పెట్టలేకపోతున్నానని అందుకే వైదొలుగుతన్నట్టు దినేశ్​.. మోర్గాన్​కు చెప్పాడట. ‘గురువారం కెప్టెన్సీ మార్పుపై చర్చ జరిగింది. కార్తీక్‌ నా వద్దకు వచ్చాడు. అప్పుడు కోచ్‌లు కూడా అక్కడే ఉన్నారు. నేను కెప్టెన్సీ పదవి నుంచి వైదొలుగుతానని కార్తీక్‌ చెప్పాడు. బ్యాటింగ్‌పై ఫోకస్‌ చేయాలనే ఉద్దేశంతోనే తప్పుకుంటున్నట్లు నాతో చెప్పాడు. కెప్టెన్సీ బాధ్యతలతో బ్యాటింగ్‌పై ఫోకస్‌ చేయలేకపోతున్నానని అందుకే తప్పుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. అది జట్టు కూడా మంచిదని వివరించాడు. కార్తీక్‌ నిస్వార్థంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ధైర్యం కావాలి’ అని అన్నాడు.

కొంతకాలంగా దినేశ్​ కార్తిక్​ కెప్టెన్సీపై సోషల్​మీడియాతో పాటు అటు సీనియర్​ క్రికెటర్ల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దినేశ్​ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్‌కు వరల్డ్‌ కప్ అందించిన దిగ్గజ క్రికెటర్​ ఇయాన్ మోర్గాన్‌ను జట్టులో ఉంచుకొని కార్తీక్‌కు కెప్టెన్సీ ఎందుకుని పలువురు సోషల్​ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ కేకేఆర్​ యాజమాన్యం మాత్రం దినేశ్​ కార్తిక్​ పైనే నమ్మకం ఉంచింది. రెండన్నరేళ్లుగా అతడు కెప్టెన్‌గా ఉన్నాడు. మరోవైపు దినేశ్ నిర్ణయం పట్ల కోల్‌కతా నైట్ రైడర్స్ సీఈవో వెంకీ మైసూరు ఏమన్నారంటే.. ‘దినేశ్‌ లాంటి కెప్టెన్​ చాలా అరుదుగా కనిపిస్తాడు. అతడు జట్టులో ఉండటం అదృష్టమన్నారు. కానీ అతడే తాను కెప్టెన్​గా ఉండలేనంటూ నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఎంతో సాహసోపేత నిర్ణయం. దినేశ్​ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. అతడు మున్ముందు మా జట్టుకు ఎంతో తోడ్పడతాడు’ అంటూ వెంకీ పేర్కొన్నారు.