Begin typing your search above and press return to search.

ఢిల్లీలోకి ఎంటర్ ది డ్రాగన్: ఆయనొచ్చాడు..

By:  Tupaki Desk   |   26 Feb 2020 7:00 AM GMT
ఢిల్లీలోకి ఎంటర్ ది డ్రాగన్: ఆయనొచ్చాడు..
X
అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ పర్యటిస్తున్నాడు.. ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటుచేశారు.. ట్రంప్ పర్యటన నేపథ్యం లో ఢిల్లీలో అంతటా ఆంక్షలు విధించారు... దేశ మొత్తం ట్రంప్ దంపతుల పర్యటనను ఆసక్తిగా గమనిస్తుంటే.. అకస్మాత్తుగా సోమవారం రాత్రి నుంచి ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. ఒక్కసారిగా పరస్పర దాడులు మొదలై మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో ఈ దాడుల్లో ఒక్కరోజే 7మంది చనిపోయిన దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండో రోజు మంగళవారం కూడా ఆందోళనలు జరిగాయి. దీంతో పోలీసులు వెంటనే స్పందించారు. కేంద్రం రంగంలోకి దిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా సైనిక బలగాలను ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మొహరింపజేశారు. అయినా ఆందోళనలు తగ్గుముఖం పట్టలేదు. ఈ క్రమంలో ఓ కీలక వ్యక్తిని రంగంలోకి దింపారు.

గతంలో కీలకమైన కశ్మీర్ వ్యవహారం లో ముఖ్య పాత్ర పోషించి పరిస్థితులు సద్దుమణిగేలా చేసిన వ్యక్తిని ప్రస్తుతం ఢిల్లీకి రంపించారు. ఆ ఆందోళనలను చల్లార్చేలా చర్యలు తీసుకోవాలని ఆ వ్యక్తికి కేంద్రం బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయన వెంటనే రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. ఆయనే అజిత్ ధోవల్. జాతీయ భద్రతా సలహాదారు, సీనియర్ పోలీసు అధికారి. 370 చట్టం రద్దు, జమ్మూకశ్మీర్ విభజన అనంతరం అక్కడ పరిస్థితులు ఉద్రిక్తం గా మారాయి. అల్లర్లు చెలరేగడంతో వాటిని అదుపులోకి తీసుకు రావడానికి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అజిత్ దోవల్ ను రంగంలోకి దింపింది. ఆయన వెళ్లిన కొన్ని నెలలకు కశ్మీర్ లో పూర్తి శాంతియుత వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం కశ్మీర్ జనజీవనం సాధారణ స్థాయికి చేరింది.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని నెలలుగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే సోమవారం ఆ ఆందోళనలు పక్కదారి పెట్టాయి. చట్టం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య వివాదం మొదలై అవి హింసాత్మకంగా మారాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ దుకాణాలు, వాహనాలు దహనం చేస్తూ బీభత్సం సృష్టించారు. ఈ దాడుల్లో తొలి రోజు ఏడుమంది చనిపోవడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వెంటనే నివారణ చర్యలపై ఫోకస్ పెట్టింది. మంగళవారం కూడా ఆందోళనలు అదుపులోకి రాకపోవడంతో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ ను పిలిపించారు. మంగళవారం రాత్రి అజిత్ దోబాల్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఢిల్లీ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. హింసాకాండను అణచివేసి శాంతిభద్రతల పరిస్థితులను మెరుగుపర్చేందుకు అజిత్ దోబాల్ రంగంలోకి దించారు.

శీలంపూర్‌లో ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్, ఈశాన్య డీసీపీ వేదప్రకాశ్ సూర్యలతో కలిసి దోవల్ శాంతి భద్రతల పరిస్థితులను సమీక్షించారు. అజిత్ దోబాల్ మంగళవారం రాత్రే ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో కలిసి మౌజ్‌పూర్, జఫరాబాద్, గోకుల్‌పురి, భాజన్‌ పూర్ ప్రాంతాల్లో తిరిగి పరిస్థితులను పరిశీలించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, అనుకూలంగా ఉన్న రెండు వర్గాల మధ్య ఘర్షణ రాజుకున్న జఫరాబాద్, మాజ్‌పూర్, బాబర్‌పూర్ ప్రాంతాల్లో పోలీస్ బలగాలతో కలిసి ఆయన పర్యటించారు.

ఆందోళనలు తగ్గుముఖం పట్టేందుకు చర్యలు చేపట్టారు. అయితే దేశంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడ్డా అజిత్ దోవల్ ప్రత్యక్షమవుతున్నారు. గతంలో కశ్మీర్ వ్యవహారంలో అజిత్ దోవల్ ప్రవేశించి ఆందోళనలు తగ్గుముఖం పట్టించారు. దీంతో ఆయన ను గుర్తించిన కేంద్రం దేశంలో అత్యవసర ఆయుధం గా వినియోగించుకుంటోంది. ప్రస్తుతం అజిత్ దోవల్ ప్రవేశం తో ఢిల్లీలో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.