ముహూర్తాలకే నమస్కారం పెట్టేస్తున్నారా ?

Thu May 06 2021 18:00:01 GMT+0530 (IST)

Engagement and marriages are being postponed

క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు భయంకరంగా మారుతుండటంతో శుభకార్యాలను రద్దు చేసుకోవటమో లేకపోతే వాయిదా పడటమో జరుగుతున్నాయి. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ లో పరిస్ధితులు మరీ భయంకరంగా మారిపోతుండటంతో చాలామంది ముందుగానే నిర్ణయమైన కార్యక్రమాలను రద్దు లేదా వాయిదా వేసుకుంటున్నారు. మామూలుగా అయితే ఈ సీజన్లో వివాహాలు ఉపనయనాలు గృహనిర్మాణాలు కొత్తగా వర్తకాలు వ్యాపారాలను ప్రారంభిస్తుంటారు.పై కార్యక్రమాలు మహా అయితే మూడు నెలలపాటు బాగా జరుగుతాయి. కాబట్టి పురోహితులు చాలా బిజీగా ఉంటారు. రాష్ట్రంమొత్తం మీద ఈ మూడు నెలల్లో కొన్ని లక్షల వివాహాలు జరుగుతాయి. కానీ కరోనా వైరస్ తీవ్రత కారణంగా నిశ్చితార్ధాలు వివాహాలు వాయిదాపడిపోతున్నాయి. ఇదే సమయంలో పురోహితులు కూడా పై కార్యక్రమాలను జరిపించేందుకు భయపడుతున్నారు. నిశ్చితార్ధాలు వివాహాలంటే ప్రభుత్వం విధించిన నిబంధనలకు మించి హాజరైపోతున్నారు.

వందలమంది హాజరయ్యే కార్యక్రమాలు కావటంతో వైరస్ తమకు ఎక్కడ సోకుతుందేమో అన్న భయంతో ముందుగా ఒప్పుకున్న శుభకార్యక్రమాలను పురోహితులు వదిలేసుకుంటున్నారు. ఒక్క విజయవాడలోనే తక్కువలో తక్కువ 20 వేలమంది పురోహితులున్నట్లు అంచనా. వీళ్ళల్లో అత్యధికులు నిశ్చితార్ధాలు వివాహాలు ఉపనయనాలను జరిపించేందుకు అంగీకరించటంలేదట. అడిగినంత డబ్బిస్తామని ఆఫర్లిస్తున్నా చాలామంది పురోహితులు దొరకటంలేదని సమాచారం.

ఒక కార్యక్రమంలో వచ్చే సంభావనకు ఆశపడితే కరోనా సోకితే తర్వాత తమకు లక్షల రూపాయలు వదులుతాయనే భయంతోనే ఒప్పుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు వరమోహన్ శర్మ అనే పురోహితుడు చెప్పారు. ఆసుపత్రుల్లో రోగులతో పాటు వారి కుటుంబసభ్యులు పడుతున్న ఇబ్బందులను చూసిన తర్వాతే తాము డబ్బులకన్నా ఆరోగ్యమే మిన్న అని నిర్ణయించుకున్నట్లు శర్మ తేల్చిచెప్పారు.