Begin typing your search above and press return to search.

ఇంధనం, కరోనా, మోడీ.. ముఖేష్ అంబానీ కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   22 Nov 2020 11:30 AM GMT
ఇంధనం, కరోనా, మోడీ.. ముఖేష్ అంబానీ కీలక వ్యాఖ్యలు
X
దేశంలోనే అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దేశ ఆర్థిక వ్యవస్థ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండు మూడు దశాబ్ధాల్లో ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ చోటు దక్కించుకుంటుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు.

పండిట్ దీనదయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ముఖేష్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంధన రంగంలో భారత్ బలమైన శక్తిగా ఎదగాలని అంబానీ అన్నారు. ఆర్థిక వ్యవస్థ పరంగానే కాకుండా స్వచ్ఛ ఇంధనం విషయంలోనూ భారత్ బలంగా ఎదగాలని అన్నారు. ఈ రెండు లక్ష్యాలను సాధించాలంటే పునరుత్పాదక ఇంధన వనరులు, కాలుష్య నియంత్రణ సాంకేతికతల్లో ఇంధన నిల్వ, వినియోగంలో కొత్త పరిష్కారాలు అన్వేషించాలన్నారు.

భారత్ ను ఆర్థిక, ఇంధన రంగాల్లో అగ్రదేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యం కావాలని ముఖేష్ అంబానీ అన్నారు. ఇంధ విప్లవాన్ని అనుసంధానించడంలో భారత్ విజయవంతమైతే ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా భారత్ అవతరిస్తుందని ముఖేష్ అన్నారు.

కరోనా తర్వాత ఖచ్చితంగా భారత్ ఆర్థికంగా నిలదొక్కుకుంటుందని ముఖేష్ అంబానీ అన్నారు. కరోనాతో పోరాటంలో కీలక దశలో ఉన్నామని.. ఈ దశలో ఎలాంటి అలసత్వం పనికిరాదన్నారు.

ఇక ప్రధాని మోడీ తీసుకొచ్చిన సంస్కరణలు భారత్ భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తాయని ముఖేష్ అంబానీ కొనియాడారు. ప్రధానిలో ఉన్న నమ్మకం, భారత్ కు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఈ సంస్కరణలు కొనసాగితే భారత్ వృద్ధికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.