ఎన్నికల బరిలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్..!

Thu Oct 10 2019 17:29:05 GMT+0530 (IST)

Encounter specialist Pradeep Sharma Declares His Assets

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఆసక్తికరంగా మారాయి. అభ్యర్థుల ఎంపికలో ఆయా పార్టీలు తీసుకుంటున్న నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మిగిలిన పార్టీలతో పోలిస్తే.. శివసేన పార్టీ బరిలోకి దింపుతున్న అభ్యర్థులే సంచలనంగా మారారు. ముంబయి మహానగరంలో మాజీ పోలీసు అధికారిగా.. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరున్న ప్రదీప్ శర్మకు తాజాగా టికెట్ కేటాయించారు.ముంబయిలోని నాలాసోపారా అసెంబ్లీ స్థానానికి శివసేన అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు. గత ఏడాది స్వచ్చందంగా పదవీ విరమణ చేసిన ఆయన.. తన నామినేషన్ పత్రాల్లో తన ఆస్తుల గురించి వివరాలు ప్రకటించి అవాక్కు అయ్యేలా చేశారు. తన స్థిరాస్తుల్ని మాత్రమే ప్రకటించిన ఆయన.. చరాస్తుల గురించి చెప్పలేదు. స్థిరాస్తుల విషయానికి వస్తే.. ఆయన పేరుతో భారీగా ఉండటం గమనార్హం.

ఆయన పేర్కొన్న ఆస్తుల విలువ మొత్తం కలిపితే రూ. 36.21 కోట్లుగా చెబుతున్నారు. 1983 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ప్రదీప్ ఎన్నికల బరిలో ఏ మేరకు విజయం సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన ఒక్కరే కాదు.. పమ్షేర్ ఖాన్ పఠాన్.. గౌతమ్ గైక్వాడ్ అనే మరో ఇద్దరు పోలీసులు అధికారులు కూడా ఎన్నికల బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి.. నేతలుగా మారిన ఈ మాజీ పోలీసు అధికారులకు ఓటర్ల నుంచి ఎలాంటి తీర్పు వెలువడుతుందో చూడాలి.