దేశంలో కొత్త ట్రెండ్.. ఐటీ ఉద్యోగులు తెగ మారిపోతున్నారట

Fri Oct 22 2021 19:00:01 GMT+0530 (IST)

Employees saying goodbye to IT companies

కరోనా తర్వాత పరిస్థితులు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తున్నాయన్న మాట బలంగా వినిపిస్తూ.. థర్డ్ వేవ్ భయాలు పక్కకు వెళుతున్న వేళలో ఐటీ ఉద్యోగులు తీసుకుంటున్న నిర్ణయాలు దేశీయంగా ఐటీ కంపెనీలకు కొత్త కష్టంగా మారిందంటున్నారు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు తమ ఉద్యోగాల్ని మారే విషయం తరచూ జరిగేదే అయినా.. ఇటీవల కాలంలో ఇది మరింత ఎక్కువగా మారిందన్న మాట వినిపిస్తోంది. ఈ వాదనకు తగ్గట్లే.. దిగ్గజ కంపెనీల్లోనూ ఉద్యోగులు వెళ్లిపోతున్న వైనం ఎక్కువ అవుతోంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో దిగ్గజ ఐటీ కంపెనీలైన విప్రోలో అత్యధికంగా 20.5 శాతం ఉద్యోగులు వలసలు వెళ్లిపోతే.. తర్వాతి స్థానంలో ఇన్ఫోసిస్ లో 20.1 శాతంగా ఉండటం గమనార్హం.తర్వాతి స్థానంలో హెచ్ సీఎల్ టెక్ లో ఈ ఎట్రియేషన్ 15.7 శాతంగా ఉందని.. టీసీఎస్ లో 11.9 శాతం ఉన్నట్లు చెబుతున్నారు. ఎందుకిలా? అంటే.. ఐటీ ఉద్యోగులకు భారీగా ఆఫర్లు రావటమే. పనిమంతులకు పెద్ద ఎత్తున వస్తున్న అవకాశాలతో ఉద్యోగుల్ని నిలుపుకోవటం కంపెనీలకు కష్టంగా మారిందంటున్నారు. నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరత ఇప్పుడు ఐటీ కంపెనీల్ని వేధిస్తోంది. దీంతో పలువురు పనిమంతులైన ఉద్యోగులకు పెద్ద ఎత్తున ఆఫర్లు వస్తున్నాయి.

ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున కంపెనీలు మారటానికి కారణం జీతాలే. పని చేస్తున్న కంపెనీలో వార్షికంగా జీతాల ఎదుగుదల ఐదు నుంచి పది శాతం మాత్రమే పెరుగుతోంది. కానీ.. కంపెనీ పెరిగితే కనీసం 20 - 30 శాతం పెరుగుతోంది. ఇప్పుడు ఇది కాస్తా 50 శాతానికి చేరుకోవటంతో.. కంపెనీల్ని మారేందుకు ఐటీ ఉద్యోగులు మక్కువ చూపిస్తున్నట్లు చెబుతున్నారు. కరోనా వేళ.. పని గంటలు పెరగటం.. ఒత్తిడి ఎక్కువ కావటంతో ఉద్యోగులు మౌనంగా వాటిని భరిస్తూ పని చేశారు.

ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు రావటం.. జీతాల పెంపు తక్కువగా ఉండటంతో పక్క కంపెనీల మీద ఉద్యోగుల చూపు ఎక్కువైందన్న మాట వినిపిస్తోంది. ఎందుకిలా? అన్న దానికి మరో కీలక కారణం కూడా ఉందంటున్నారు. అమెరికా.. ఐరోపాకు చెందిన పలు దేశాల్లోని కంపెనీలు తమ ఆఫ్ షోర్ ప్రాజెక్టుల్ని ఇండియాలోని పలు నగరాలకు తరలిస్తున్నాయి. దీంతో.. ఉద్యోగుల కొరత.. నైపుణ్యంఉన్న వారి అవసరం ఎక్కువ అవుతోంది. దీంతో.. తమకువచ్చిన ప్రాజెక్టుల్ని నిలుపుకోవటం కోసం జీతాల్ని పెద్ద ఎత్తున ఆఫర్ చేయటంతో.. ఉద్యోగుల్లో వలస అంతకంతకూ ఎక్కువ అవుతోంది.