Begin typing your search above and press return to search.

ఎన్నికల నోటిఫికేషన్‌ పై భగ్గుమన్న ఉద్యోగులు ... నిమ్మగడ్డ పై ఫైర్ !

By:  Tupaki Desk   |   23 Jan 2021 9:45 AM GMT
ఎన్నికల నోటిఫికేషన్‌ పై భగ్గుమన్న ఉద్యోగులు ... నిమ్మగడ్డ పై ఫైర్ !
X
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ఎస్ ఈ సీ నోటిఫికేషన్ విడుదలైంది. తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ ‌‌ను కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేశారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల్ని నిర్వహిస్తామన్నారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 4 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. విజయనగరం, ప్రకాశం జిల్లాలకు తొలి విడతలో ఎన్నికలు నిర్వహించడం లేదని చెప్పారు.

అయితే, ఎస్ ఈ సీ విడుదల చేసిన ఈ ఎన్నికల నోటిఫికేషన్ పై ఉద్యోగులు భగ్గుమన్నారు. కరోనా ప్రభావం ఉందని చెప్పినా, వ్యాక్సినేషన్‌ పూర్తికాకుండా ఎన్నికలు వద్దని చెప్పినా వినకుండా నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఇవ్వడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించలేమని స్పష్టం చేస్తున్నారు. పలుచోట్ల ధర్నాలకు దిగిన ఉద్యోగ సంఘాలు, మెరుపు సమ్మెకూ సై అంటున్నారు. సోమవారం సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అంటున్నారు.

తాను గ్లాస్‌ ఛాంబర్లో కూర్చుని ప్రెస్‌ మీట్‌ నిర్వహించి తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహిస్తారా అని ఉద్యోగులు నిమ్మగడ్డను ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు జారీ అయిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ‌పై ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య స్పందించింది. టీకా ఇచ్చేవరకూ ఎన్నికల విధుల్లో పాల్గొనేది లేదని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి తేల్చిచెప్పారు.

మా ప్రాణాలను రక్షించుకునే హక్కు మాకుందని వెంకట్రామిరెడ్డి తెలిపారు. రాజ్యాంగం తమకు ఆ హక్కు కల్పించిందన్నారు. విధులకు సమ్మతించే వారితో ఎన్నికలు జరుపుకోవచ్చని ఆయన సూచించారు. ఎన్నికలు పెట్టాలనే పంతంతో ఎస్‌ ఈసీ ఉన్నారన్నారు.

ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ తీరుపై ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి కూడా తీవ్రంగా మండిపడ్డారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించే హక్కు నిమ్మగడ్డకు లేదన్నారు. గ్లాస్‌ ఛాంబర్‌ లో ఎన్నికల నోటిఫికేషన్ ప్రెస్ ‌మీట్‌ నిర్వహించిన నిమ్మగడ్డ, తమను మాత్రం రోడ్లపైకి వెళ్లి ఎన్నికల విధులు నిర్వహించమని ఎలా చెబుతారని ప్రశ్నించారు. జీహెచ్‌ ఎంసీ ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు కరోనా సోకిన విషయాన్ని చంద్రశేఖర్‌ రెడ్డి గుర్తుచేశారు.

10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఒకే తాటిపై ఉన్నామని, ఉద్యోగులను భయపెట్టాలని నిమ్మగడ్డ చూస్తున్నారని ఆయన ఆరోపిచారు. మమ్మల్ని భయపెట్టి చంపే అధికారం మీకు లేదని,. అవసరమైతే సమ్మెకు కూడా వెనుకాడమని ఎన్జీవో నేత చంద్రశేఖర్‌ రెడ్డి హెచ్చరించారు.