Begin typing your search above and press return to search.

ప్రముఖ ఐటీ కంపెనీలపైన కేసు పెట్టిన ఉద్యోగులు

By:  Tupaki Desk   |   11 Sep 2019 10:17 AM GMT
ప్రముఖ ఐటీ కంపెనీలపైన కేసు పెట్టిన ఉద్యోగులు
X
ఐటీ వాళ్లు అన్నంతనే ఉత్తపుణ్యనికే లక్షలాది రూపాయిలు జీతాల రూపంలో వస్తాయని.. వాళ్లను ఇంటి అల్లుళ్ల మాదిరి చూస్తారన్న ఫీలింగ్ ఉండేది. అలాంటి రోజులు పోయి చాలాకాలమే అయిపోయింది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారటమే కాదు.. వారి శ్రమను దోపిడీ చేస్తున్న తీరు అంతకంతకూ పెరిగిపోతోంది.

ఎంత పని చేసినా.. ఏ రోజున ఉద్యోగం ఉంటుందో? ఏ రోజు ఉండదో? ఉద్యోగి పని తీరు బాగున్నా.. కంపెనీకి ప్రాజెక్టులు రాకుంటే.. దాని బాధ్యత కూడా ఉద్యోగుల మీద పడటంతో పాటు.. ఇప్పుడున్న పరిస్థితుల్ని అసరాగా చేసుకొని చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా చాలా ఐటీ కంపెనీలు ఉద్యోగుల మీద అప్రకటిత నిబంధనల్ని తీసుకొచ్చి చుక్కలు చూపిస్తున్నారు.

ఐటీ కంపెనీల ఆరాచకాలపై తాజాగా హైదరాబాద్ కు చెందిన ముగ్గురు ఐటీ ఉద్యోగులు కోర్టుకు ఎక్కటం సంచలనంగా మారింది. అది కూడా ప్రముఖ కంపెనీలుగా పేరున్న యాక్సెంచర్.. కాగ్నిజెంట్.. కాస్పెక్స్ కార్పొరేషన్ లాంటి కంపెనీలు కావటం గమనార్హం.

ఫోరమ్ ఫర్ ఎగైనెస్ట్ కరప్షన్ కార్యకర్తలు కొందరు కలిసి తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పరిణామం భారతదేశ ఐటీ పరిశ్రమలో ఒక కొత్త పరిణామంగా చెబుతున్నారు. ఉపాధి పేరుతో రాష్ట్రంలో వైట్ కాలర్స్ బానిసత్వం అంటూ టెకీలు తమ గళాన్ని విప్పారు. ఎక్కువ గంటలు పని చేయించుకోవటం.. లీవుల విధానంలో అనుసరిస్తున్న చెత్త వైఖరితో పాటు.. ప్రోత్సాహకాల విషయంలో ఆయా సంస్థలు వ్యవహరిస్తున్న తీరును ప్రస్తావిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో సదరు కంపెనీలు రియాక్ట్ కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐటీ ఉద్యోగుల జీవితాల్ని మెరుగుపర్చేందుకే తామీ పిటిషన్ దాఖలు చేశామని.. పని పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఎలాంటి అదనపు వేతనం లేకుండానే 10 గంటల పాటు పని చేయాల్సి రావటం.. క్యాబ్ లలో మూడు నాలుగు గంటలు గడపాల్సి రావటంపై తమ పిటిషన్ లో ప్రస్తావించినట్లు చెబుతున్నారు. తెలంగాణలోని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారం తెలంగాణ.. హైదరాబాద్ తో పాటు ఇతర ఐటీ హబ్ లలో నియమించే చట్టాలకు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని వారు ప్రస్తావించారు. ఉద్యోగులను వారానికి 48 గంటలు.. లేదంటే రోజుకు ఎనిమిది గంటలు.. ఓవర్ టైం వారానికి ఆరు గంటలు లేదంటే.. ఏడాదిలో 24 గంటలు మాత్రమే చేయించాలి. అంతేకాదు.. ప్రతి ఉద్యోగి ఏడాదిలో 15 రోజులు పెయిడ్ లీవ్.. 12 రోజులు క్యాజువల్ లీవు.. మరో 12 రోజులు సిక్ లీవ్ ఇవ్వాల్సి ఉన్నా.. అలాంటివేమీ చేయటం లేదన్న ఆరోపణ వారు చేశారు. మరి.. దీనిపై ఐటీ కంపెనీలు ఏం చెబుతాయి? తుదకు కోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.