Begin typing your search above and press return to search.

హ్యూమనాయిడ్ రోబో తయారీ.. ఎలన్ మస్క్ మరో సంచలనం

By:  Tupaki Desk   |   25 Jun 2022 11:30 PM GMT
హ్యూమనాయిడ్ రోబో తయారీ.. ఎలన్ మస్క్ మరో సంచలనం
X
ప్రపంచంలోనే అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ మరో సంచలనానికి తెరతీశాడు. ఇప్పటికే ఆకాశానికి నిచ్చెన వేసి అంతరిక్ష యాత్రను చేరువ చేసిన ఎలన్ మస్క్ ఇప్పుడు మనిషికి ప్రత్యామ్మాయాన్ని ఆవిష్కరించే పనిలో బిజీగా ఉన్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన 'రోబో' సినిమాలో చిట్టీ రోబోను పోలిన హ్యూమనాయిడ్ రోబో తయారీకి పూనుకున్నాడు.

అచ్చంగా రోబో సినిమాలోలాగా హ్యూమనాయిడ్ రోబోను తయారు చేస్తున్నట్టు ఎలన్ మస్క్ సంచలన ప్రకటన చేశాడు. ఈ రోబోకి సంబంధించిన బిగ్ అనౌన్స్ మెంట్ ను మరో మూడు నెలల్లో చేయబోతున్నట్టు మస్క్ తెలిపారు.

ఎలన్ మస్క్ ఎప్పుడూ 100 ఏళ్లు ముందు ఆలోచిస్తాడు. సంప్రదాయ వ్యాపారం చేయడు. భిన్నంగా ఆది నుంచి టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణలకు పెద్ద పీట వేస్తాడు. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడిగా గుర్తింపు పొందాడు.

పేపాల్ మనీ ట్రాన్స్ ఫర్ నుంచి మొదలైన ఎలన్ మస్క్ ప్రస్థానం ఆ తర్వాత స్పేస్ ఎక్స్, టెస్లాల నుంచి ఇప్పుటు ట్విట్టర్ టేకోవర్ వరకూ సాగింది. మధ్యలో ఇప్పుడు హ్యుమనాయిడ్ రోబోను తయారు చేసే పనిలో పడ్డారు.ఈ సీక్రెట్ ఆపరేషన్ ను 2021 ఆగస్టులోనే బయటి ప్రపంచానికి అధికారికంగా మస్క్ వెల్లడించారు.

తాజాగా ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ లో ఎలన్ మస్క్ మాట్లాడారు. తన హ్యుమనాయిడ్ రోబోకి సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. ఈ రోబోకు 'ఆప్టిమస్' పేరు పెట్టినట్లు వివరించారు. 'టెస్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డే'ను పురస్కరించుకొని 2022 సెప్టెంబర్ 30న ఈ రోబోను ఆవిష్కరిస్తామంటూ మస్క్ వెల్లడించారు.

ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఆరు అడుగుల ఎత్తు ఉండే ఆప్టిమస్ హ్యుమనాయిడ్ రోబో గంటకు 8 కి.మీల వేగంతో నడవగలదు. 68 కేజీల బరువులను ఎత్తగలదు. తయారీ కంపెనీల్లో కొన్ని పనులను అవలీలగా చేయగలదు. ప్రమాదకర టాస్కుల్లోనూ రోబో అద్భుతమైన సేవలు అందించగలదు.

టెస్లా కార్లతో కూడా ఈ రోబోలు అనుసంధానించబడి ఉంటాయి. సెప్టెంబర్ 30న ఈ రోబోలను ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.