Begin typing your search above and press return to search.

షాకే.. ఏకంగా 13 కోట్ల మందికి కరెంట్‌ కట్‌!

By:  Tupaki Desk   |   5 Oct 2022 6:34 AM GMT
షాకే.. ఏకంగా 13 కోట్ల మందికి కరెంట్‌ కట్‌!
X
భార‌త్ పొరుగు దేశం.. బంగ్లాదేశ్‌లో విద్యుత్ గ్రిడ్ వ్య‌వస్థ కుప్ప‌కూలడంతో ఆ దేశంలో ఏకంగా 13 కోట్ల మందికి విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. అక్టోబ‌ర్ 4 మ‌ధ్యాహ్నం నుంచి బంగ్లాదేశ్‌లో 80 శాతానికి పైగా ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాలో ఆక‌స్మికంగా అంత‌రాయం ఏర్ప‌డింద‌ని బంగ్లాదేశ్ డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డు పేర్కొంది.

బంగ్లాదేశ్ లో వాయ‌వ్య ప్రాంతాలు మిన‌హాయించి.. మిగ‌తా దేశ‌మంతా క‌రెంట్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. దీంతో 13 కోట్ల మందికి విద్యుత్ స‌ర‌ఫ‌రా ఆగిపోయింది. అయితే గ్రిడ్ కుప్ప‌కూల‌డానికి, అంత‌రాయానికి కార‌ణాలు ఏంటో ఇంకా స్ప‌ష్టంగా తెలియ‌ద‌ని బంగ్లాదేశ్ డెవ‌ల‌ప్‌మెంట్ బోర్డు తెలిపింది. ఏం జ‌రిగింద‌నే దానిపై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నామ‌ని వెల్ల‌డించింది. సాంకేతిక కార‌ణాలే గ్రిడ్ వైఫ‌ల్యానికి కార‌ణం కావ‌చ్చ‌ని పేర్కొంది.

దేశ రాజ‌ధాని ఢాకాలో కూడా విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. ఢాకాలో 2.2 కోట్ల మంది నివసిస్తున్నారు. ఇక్క‌డ మంగ‌ళ‌వారం రాత్రి 8 గంటల నాటికి విద్యుత్ సరఫరాను పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామ‌ని అధికారులు తెలిపారు. మరోవైపు.. కరెంట్‌ కోతలపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. బంగ్లాదేశ్‌లో చివరిసారి 2014 నవంబర్‌లో భారీ బ్లాక్‌ అవుట్‌ ఏర్పడింది. అప్పుడు కూడా ఆ దేశంలో దాదాపు 70 శాతం మందికి దాదాపు 10 గంటలపాటు విద్యుత్‌ సౌకర్యం నిలిచిపోయింది.

కాగా బంగ్లాదేశ్‌ ప్రస్తుత జనాభా దాదాపు 16.51 కోట్లు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో.. అంతర్జాతీయంగా పెరిగిన ఇంధన ధరల‌తో బంగ్లాదేశ్ ఇటీవల‌ తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంది. విద్యుత్‌ డిమాండ్‌ కోసం దిగుమతి చేసుకున్న డీజిల్, గ్యాస్‌ ధరల చెల్లింపులు.. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి భారంగా మారాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఆ దేశంలోని విద్యుత్ ఉత్పత్తిలో దాదాపు మూడు వంతుల వాటా సహజ వాయువుదే కావ‌డం గ‌మ‌నార్హం.
బంగ్లాదేశ్‌లోని గ్యాస్‌తో నడిచే 77 యూనిట్లలో మూడింట ఒక వంతు గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి.

బంగ్లాదేశ్ ఆర్థిక వృద్ధికి విద్యుత్ కొరతతో ముప్పు ఏర్పడింది. ఇంధ‌న‌ ధరలు పెర‌గ‌డంతో ఖర్చులను తగ్గించడానికి ప్రభుత్వం అన్ని డీజిల్‌తో నడిచే పవర్ ప్లాంట్ల కార్యకలాపాలను నిలిపివేసింది.

ఈ నెల ప్రారంభంలో.. బంగ్లాదేశ్ గార్మెంట్ తయారీదారులు, ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు ఫరూక్ హసన్ మాట్లాడుతూ.. పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, వస్త్ర కర్మాగారాల్లో ఇప్పుడు రోజుకు నాలుగు నుండి 10 గంటల పాటు విద్యుత్తు ఉండటం లేద‌ని తెలిపారు.

బంగ్లాదేశ్... చైనా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద వస్త్ర ఎగుమతిదారుగా ఉంది. ప్రతి సంవత్సరం గార్మెంట్ ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా దాని మొత్తం విదేశీ కరెన్సీలో 80 శాతానికి పైగా సంపాదిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.