Begin typing your search above and press return to search.

ముహూర్తం ఫిక్స్ : 2023 మార్చిలో ఏపీలో ఎన్నికలు...?

By:  Tupaki Desk   |   15 May 2022 8:21 AM GMT
ముహూర్తం ఫిక్స్ : 2023 మార్చిలో ఏపీలో ఎన్నికలు...?
X
ఆంధ్రా లో ఎన్నికల హడావుడి ఇప్పటి నుంచే మొదలైంది. దాంతో అన్ని రాజకీయ పార్టీలు రోడ్డు మీదకు వచ్చేశాయి. ఇక చూస్తే అధికార పార్టీ వైసీపీ 2024లో షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ముందుకు జరిపే ఆలోచనలో ఉంది అంటున్నారు. దానికి రాజకీయ ఆర్ధిక కారణాలే ప్రధాన కారణం అని అంటున్నారు. దాంతో ఇప్పటికి మరో పది నెలల్లో ఏపీలో ఎన్నికల నగారా మోగబోతోంది అని అంటున్నారు

ఏపీలో వచ్చే ఏడాది మర్చి లో ఎన్నికలు జరగడం ఖాయమనీంటున్నారు. అంటే ఇంకా పద్నాలుగు నెలల పదవీ కాలం ఉండగానే జగన్ దాన్ని త్యాగం చేసి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు అంటున్నారు. అలా ఎందుకు జగన్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న వారికి ప్రతీ రోజూ కూడా కీలకం, ముఖ్యం. ఏ ఒక్క అవకాశాన్ని వారు వృధా చేసుకోరు కదా . అలాంటపుడు ఎందుకు ముందస్తు ఎన్నికలకు జగన్ వెళ్తున్నారు అంటే జగన్ నెత్తిన కుంపటిని దించుకోవడానికే అని బదులు వస్తోంది

అంటే ఏపీకి పైసా అప్పు పుట్టే పరిస్థితి లేదు. అన్ని రకాలుగా వనరులను వాడేశారు. ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకువచ్చారు. ఇంత చేసినా మూడేళ్ళు మాత్రమే సర్కార్ నడపగలిగారు. మరో ఏడాది నడపడం కూడా ఇపుడున్న పరిస్థితుల్లో కష్టమే కానీ జగన్ ఆలోచనలు చూస్తే ఏదోలా ఈ ఏడాది నెట్టుకుని కాస్తా అయినా అభివృద్ధి చూపించి సంక్షేమ పధాకాల అండతో ఎన్నికల గోదాను ఈదాలను చూస్తున్నారు అంటున్నారు.

అదే కనుక నిజమైతే మాత్రం ఎన్నికలు 2023 మార్చిలోనే జరుగుతాయని అంటున్నారు. దానికి సంబంధించి మెల్లగా పూర్వరంగాన్ని జగన్ సిద్ధం చేసుకుంటున్నారు అని అంటున్నారు. మంత్రి వర్గాన్ని విస్తరించారు. అలాగే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. జూలైలో ప్లీనరీ నిర్వహించి క్యాడర్ కి దిశా నిర్దేశం చేస్తారు. ఇక గడప గడపకు ప్రభుత్వం అన్న కార్యక్రమాన్ని మొదలెట్టడానికి కూడా ముందస్తు ఎన్నికలే కారణం అని అంటున్నారు.

దీనికి బలం చేకూరేలా ఒక నియామకం కూడా ఇపుడు కళ్ల ముందు ఉంది. రాష్ట్ర ఎన్నికల అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనాను కేంద్రం తాజాగా నియమించింది. ఆయనకు ముందు ఉన్న విజయానంద్ ఇప్పటికే రెండు ఉప ఎన్నికలు, తిరుపతి లోక్ సభ ఎన్నికను జరిపించారు.

ఇక ముందస్తు ఎన్నికలలో వ్యూహంగా మాత్రమే జగన్ ముఖేష్ కుమార్ మీనాను కేంద్రంతో సంప్రదించి నియామకం చేయించుకున్నారు అని అంటున్నారు. ఎన్నికల వేళ స్టేట్ చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ ది కీలకమైన పాత్ర అని కూడా చెబుతారు. మొత్తానికి ఈ నియామకం బట్టి చూస్తే జగన్ ముందస్తు సన్నాహాలు పీక్స్ చేరాయని అంటున్నారు.

ఒక వైపు విపక్షం మరింతగా బలపడకముందే ఆర్ధిక వ్యవస్థ నుంచి ఇబ్బందులు ఎదురుకాక ముందే ఎన్నికలకు వెళ్ళడం ద్వారా మరో మారు అధికారం కైవశం చేసుకోవాలని జగన్ చూస్తున్నారు అంటున్నారు. మరి జగన్ ముందస్తు అంటే కేంద్రం సహకరించాలి. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తు ఆలోచనల్లో ఉంటే మాత్రం వచ్చే ఏడాది ఎన్నికలు జరగడం ఖాయం. లేకపోతే జగన్ కోసం ప్రత్యేకంగా కేంద్రం పచ్చ జెండా ఊపుతుందా అన్నది మాత్రం ఆలోచించాలి.