Begin typing your search above and press return to search.

ఆ ఒక్క సంస్థ తప్పించి.. అందరూ ఆ పార్టీనే యూపీ విజేతగా చెబుతున్నారు

By:  Tupaki Desk   |   19 Jan 2022 8:30 AM GMT
ఆ ఒక్క సంస్థ తప్పించి.. అందరూ ఆ పార్టీనే యూపీ విజేతగా చెబుతున్నారు
X
మరో నెలలో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలుజరుగుతున్న విషయం తెలిసిందే. పేరుకు ఐదు రాష్ట్రాలు అయినప్పటికి ఉత్తరప్రదేశ్.. పంజాబ్ రాష్ట్రాల మీదనే అందరి ఆసక్తి ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లోనూ యూపీ మీదనే అందరి ఫోకస్. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో చోటుచేసుకునే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా జాతీయ రాజకీయాల సమీకరణాలు మారతాయన్న అంచనా వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. యూపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ గెలుపు ఖాయమని స్పష్టం చేస్తున్నాయి మీడియా సంస్థల రిపోర్టలు.

అయితే.. అందుకు భిన్నంగా బీజేపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు సమాజ్ వాదీ పార్టీలోకి సాగటం ఆసక్తికరంగా మారింది. అయినప్పటికీ గెలుపు మాత్రం తమదేనని కమలనాథులు గట్టి నమ్మకంలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు వెలువడిన మీడియా సంస్థల సర్వే రిపోర్టుకు భిన్నంగా డీబీ లైవ్ అనే సంస్థ ఒక్కటి మాత్రం భిన్నమైన ఫలితాన్ని అంచనా వేస్తోంది.

ఇప్పటివరకు పలు మీడియా సంస్థలు వెల్లడించిన లెక్కల ప్రకారం బీజేపీకి 200 నుంచి 230 వరకు సీట్లు బీజేపీకి వస్తాయని అంచనా వేశారు. ఎక్కువ పోల్స్ లో 221 వరకు వస్తాయని పేర్కొన్నారు. తర్వాతిస్థానంలో సమాజ్ వాదీ పార్టీ నిలుస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో.. నాలుగో స్థానంలో బీఎస్పీ నిలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే.. డీబీ లైవ్ సంస్థ మాత్రం బీజేపీకి కేవలం144 నుంచి 152 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పటం ఆసక్తికరంగా మారింది.

యూపీ అసెంబ్లీలో 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 202 స్థానాల్ని ఎవరైతే సొంతం చేసుకుంటారో.. వారి చేతికి అధికారం అందుతుంది. డీబీ లైవ్ సంస్థ ప్రకారం బీజేపీకి 150 సీట్లు మాత్రమే వస్తే అధికారం చేజారటం ఖాయం. అయితే.. అది సాధ్యమా? అన్నది ప్రశ్నగా మారింది. మిగిలిన మీడియా సంస్థల అంచనాలకు భిన్నంగా చెబుతున్న ఈ సంస్థ లెక్కలు నిజమవుతాయి? మిగిలిన వారి లెక్కలు వాస్తవ రూపం దాలుస్తాయా? అన్నది తేలాలంటే ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు.