Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన ఈసీ ..!

By:  Tupaki Desk   |   19 Nov 2019 8:31 AM GMT
వైసీపీ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన ఈసీ ..!
X
నోరు ఒకసారి జారితే మళ్లీ మనం ఆ మాటని నోట్లోకి పంపలేం. కాబట్టి నోరుని కొంచెం మన అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. లేకపోతే దారిన పోయే సమస్యలు కూడా మన మెడకే చుట్టుకుంటాయి. తొందరపాటుతో నోరు జారి ..ఆ తరువాత ఎన్నో ఇబ్బందులకు గురైన వారు ఎంతోమందిని మనం చూసే ఉంటాం. అలాగే వైసీపీ ఎమ్మెల్యే కూడా నోరు జారి లేనిపోని సమస్యల్లో చిక్కుకుంది. అసలు విషయంలోకి వెళ్తే ..

వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై కులవివక్ష వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఓ ఇంటర్వ్యూ లో భాగంగా ఆమె మాట్లాడుతూ .. నేను క్రిస్టియన్ అని - తన భర్త కాపు కులస్థుడని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చెప్పింది. కానీ, ఆమె ఎన్నికలలో పోటీ చేస్తున్న సమయంలో మాత్రం ఎస్సీ అని తెలిపింది. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ పత్రాల్లో తాను ఎస్సీ సామజిక వర్గం అంటూ అఫిడవిట్ లో రిజిస్టర్ చేసుకుందని - నిజానికి శ్రీదేవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కాదంటూ అప్పట్లో పెద్ద రాద్ధాంతం జరిగిన విషయం తెలిసిందే.

2019 ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి ఉండవల్లి శ్రీదేవి వైకాపా తరఫున పోటీ చేసి - ప్రత్యర్థి తెదేపా అభ్యర్థి శ్రావణ్ కుమార్‌ పై విజయం సాధించారు. ఆ తరువాత ఓ ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ .. తాను క్రిస్టియన్ అని చెప్పిన విషయాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున సంతోష్ అనే వ్యక్తి ప్రస్తావిస్తూ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. క్రిస్టియన్‌ గా చెప్పుకున్న శ్రీదేవికి ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన నియోజకవర్గం నుంచి పోటీ చేసే అర్హత లేదని అందులో తెలిపారు. ఈ ఫిర్యాదుపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. వాస్తవాలు విచారించాలని ఎన్నికల కమిషన్‌ కు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఉండవల్లి శ్రీదేవి రిజర్వేషన్ పై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్‌ ను రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఈ ఫిర్యాదు మేరకు ఈ నెల 26న మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరుకావాలని జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఎమ్మెల్యే కి ఆదేశాలు జారీ చేశారు. తాను ఎస్సీ అని నిరూపించేందుకు అవసరమైన పత్రాలు - బంధువులను కూడా వెంట తీసుకుని రావచ్చని దినేష్ కుమార్ చూచించారు. విచారణలో శ్రీదేవి ఎస్సీ కాదని తేలిన పక్షంలో ఆమెను ఎమ్మెల్యే పదవికి అనర్హురాలుగా ప్రకటించే అవకాశం ఉంది.