'పెద్దల' ఎన్నికల హడావుడి షురూ.. 57 స్థానాల భర్తీకి షెడ్యూల్ రిలీజ్

Thu May 12 2022 18:19:29 GMT+0530 (IST)

Election Commission Rings Poll Siren

పెద్దల సభగా పేర్కొనే రాజ్యసభలో ఖాళీ స్థానాలకు తాజాగా ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా మొత్తం పదిహేను రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జూన్ 10న జరగనుండగా.. అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాల్ని ప్రకటిస్తారు. షెడ్యూల్ విషయానికి వస్తే..మే 24న  రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్
24 - 31 వరకు నామినేషన్ల స్వీకరణ
జూన్ 1న నామినేషన్ల పరిశీలన
జూన్ 3న నామినేషన్ల విత్ డ్రా
జూన్ 10న పోలింగ్ (ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్)
అదే రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాల వెల్లడి.  

తాజాగా వెలువడిన ఎన్నికల షెడ్యూల్ లో మొత్తం 15 రాష్ట్రాల్లో 57 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 11 స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే.. తర్వాతి స్థానాల్లో తమిళనాడు మహారాష్ట్రలు నిలుస్తాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఆరు స్థానాల చొప్పున భర్తీ చేయనున్నారు. తర్వాతి స్థానంలో బీహార్ లో ఐదు స్థానాల్లో భర్తీ చేయనున్నారు. రాష్ట్రాల వారీగా ఖాళీల్ని చూస్తే..

ఉత్తరప్రదేశ్       11
మహారాష్ట్ర      06
తమిళనాడు    06
బిహార్             05
ఛత్తీస్ గఢ్        04
రాజస్థాన్          04
ఆంధ్రప్రదేశ్       04
మధ్యప్రదేశ్      03
ఒడిశా             03

జార్ఖండ్ పంజాబ్ ఉత్తరాఖండ్ తెలంగాణ హర్యానా రాష్ట్రాల్లో రెండేసి స్థానాల చొప్పున భర్తీ చేయనున్నారు. మిగిలిన రాష్ట్రాల విషయాన్ని పక్కన పెట్టి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో భర్తీ చేయాల్సిన ఖాళీల్లో ఎవరెవరికి అవకాశం లభిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా అందుతున్న అంచనాల ప్రకారం చూస్తే.. తెలంగాణలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తో పాటు సీనియర్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను ఎంపిక చేసే అవకాశం ఉందంటున్నారు.

ఏపీ విషయానికి వస్తే.. ప్రస్తుతం పదవీ కాలం ముగియనున్న విజయసాయి రెడ్డికి మరోసారి రాజ్యసభ సభ్యుడిగా సీఎం జగన్మోహన్ రెడ్డి రెన్యువల్ చేస్తారని చెబుతున్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బీదా మస్తానరావుకు.. కిల్లి కృపారాణికి బీసీ కోటాలో కేటాయించే వీలుందంటున్నారు. ఒకవేళ గౌతమ్ అదానీ సతీమణికి రాజ్యసభకు ఎంపిక చేస్తే కిల్లికి అవకాశం ఉండదంటున్నారు.

అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గౌతమ్ అదానీ కుమారులైన కరణ్ అదానీ.. జీత్ ఆదానీల్లో ఒకరికి వైసీపీ తరఫున రాజ్యసభకు పంపే అవకాశం ఉందంటున్నారు. గతంలో ముకేశ్ అంబానీ ఆబ్లిగేషన్ లో భాగంగా పరిమళ్ నత్వానీని రాజ్యసభకు ఎంపిక చేయటం తెలిసిందే. ఇప్పుడు కూడా అదానీ ఫ్యామిలీకి అవకాశం కల్పిస్తే మాత్రం.. సీఎం జగన్మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో సంచలనంగా మారతారన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.