జర్మనీలో కాల్పులు.. ఏకంగా 8 మంది మృత్యువాత

Thu Feb 20 2020 10:50:09 GMT+0530 (IST)

Eight People Killed in Shootings Near Frankfurt

ప్రశాంతంగా ఉండే యూరప్ లో ఈ మధ్య కాలంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. సురక్షిత దేశాలుగా ఉన్న వాటి పేర్లు ఇటీవల చోటు చేసుకుంటున్న హింసాత్మక ఉదంతాలతో వాటి ఇమేజ్ మారిపోతోంది. తాజాగా అలాంటి ఉదంతమే జర్మనీలో చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఉదంతంలో ఏకంగా ఎనిమిది మంది మృతి చెందిన వైనం షాకింగ్ గా మారింది. మరో ఐదుగురు గాయపడ్డారు.దీనికి కారణం ఎవరన్న దాని మీద పెద్ద ఎత్తున విచారణ జరుగుతోంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి పది గంటల తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో మారణహోమాన్ని సృష్టించారు. తొలుత నగరం మధ్యలో ఉన్న హుక్కా సెంటర్ వద్ద కాల్పులు మొదలైనట్లుగా చెబుతున్నారు. విచక్షణ రహితంగా కాల్పులు జరిపి.. ఆ వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు.

అక్కడి నుంచి దుండగులు కారులో వేరే ప్రాంతానికి చేరుకొని మరోసారి కాల్పులు తెగబడినట్లుగా పోలీసులు చెబుతున్నారు. హుక్కా సెంటర్ వద్ద జరిపిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. రెండో ఉదంతంలో ఐదుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటన జర్మనీ లో సంచలనంగా మారింది. కాల్పులకు కారణం ఏమిటన్నది ఇంకా బయటకు రాలేదు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు.