ఈటల హెల్త్ రిపోర్ట్ః లేటెస్ట్ అప్డేట్ ఇదే

Sat Jul 31 2021 14:02:19 GMT+0530 (IST)

Etela Health Report: This is the latest update

మాజీ మంత్రి బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈటలను పరిశీలించిన వైద్యులు ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. బీపీ అదుపులోనే ఉందని షుగర్ లెవల్స్ మాత్రం పెరుగుతూ తగ్గుతున్నట్టు తెలిపారు.హుజూరాబాద్ పోరాటం ముందుగానే మొదలు పెట్టిన ఈటల రాజేందర్ ‘ప్రజా దీవెన’ పేరుతో పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామాన్ని చుట్టేసే ప్రణాళిక చేపట్టారు. ఈ క్రమంలో వీణవంక మండలం కొండపాకలో పర్యటించిన తర్వాత ఈటల అస్వస్థతకు గురయ్యారు. దీంతో.. వీణవంక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

పాదయాత్రలో కాళ్లకు పొక్కులు రావడం జ్వరం కూడా ఉన్నట్టు గుర్తించి హైదరాబాద్ తరలించాలని సూచించారు. దీనికి ఈటల అంగీకరించలేదు. దీంతో.. బస్ లోనే బీపీ షుగర్ లెవల్స్ పరిశీలించి సెలైన్ కూడా ఎక్కించారు. అయితే.. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఇవాళ హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

కాగా.. ముందస్తు జాగ్రత్తలో భాగంగా నిన్న కొవిడ్ టెస్ట్ కూడా నిర్వహించారు. ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా.. నెగెటివ్ రిపోర్టు వచ్చింది. ప్రస్తుతం ఈటల రాజేందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈటల ఆసుపత్రిలో చేరడంతో.. ప్రజాదీవెన యాత్రకు బ్రేక్ పడింది. మరి ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు? ఆ వెంటనే పాదయాత్ర మొదలు పెడతారా? విశ్రాంతి తీసుకుంటారా? అన్నది చూడాలి.