Begin typing your search above and press return to search.

ప్రముఖ మీడియా యాజమాన్యం టార్గెట్ గా ఈడీ దాడులు...?

By:  Tupaki Desk   |   7 Oct 2022 2:30 PM GMT
ప్రముఖ మీడియా యాజమాన్యం టార్గెట్ గా ఈడీ దాడులు...?
X
ఎంఫోర్స్  మెంట్ డైరెక్టరేట్ ఇపుడు సంచలన వార్తా విశేషంగా ఉంది. ఎపుడు ఎవరి మీద ఈడీ దాడులు జరుగుతాయో అర్ధం కాని పరిస్థితి ఉంది. ఇదిలా ఉండగా  ఢిల్లీలోని మద్యం కుంభకోణానికి సంబంధించి అని చెబుతూ  తాజాగా మరోసారి  హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో సీబీఐ తో పాటు ఈడీ కూడా దాడులు చేసింది. అలాగే వివిధ రాజకీయ పార్టీల నాయకుల పేర్లు కూడా ఇందులో వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే తెలంగాణా సీఎం కేసీయార్ కొత్తగా జాతీయ పార్టీ ప్రకటించిన తరువాత ఈ రకమైన దాడులు జరగడం అంటే ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు. ఈ దాడులలో నేపధ్యం ఒక వైపు ఉంటే మరో వైపు తెలుగులో విశేషం ప్రాచుర్యం పొందిన ఒక దిన పత్రిక యాజమాన్యం మీద ఈడీ దాడులు చేసిందని వార్తలు వస్తున్నాయి.

ఆంధ్రప్రభ వార్తాపత్రికతోపాటు దాని ఇంగ్లీష్ ఛానెల్, ఇండియా ఎహెడ్ ప్రమోటర్లపై ఈడీ  దాడులు జరుగుతున్నాయని కూడా సంచలన వార్తలు రావడం ఇపుడు చర్చనీయాంశం అయింది. నిజానికి ఈ దాడులు ఆ మీడియా యాజమాన్యం మీద ఎందుకు జరుగుతున్నాయన్నది మాత్రం ఎవరికీ ఎటువంటి సమాచారం కూడా తెలియరావడంలేదు.

ఇక సదరు మీడియా యజమాని ముత్తా గోపాలక్రిష్ణ  గతంలో కాంగ్రెస్ తరఫున కాకినాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తరువాత రోజుల్లో వైసీపీలో చేరారు. టికెట్ దక్కలేదని 2019 ఎన్నికల వేళ ఆంధ్ర ప్రభ యజమాని అయిన ముత్తా గోపాలక్రిష్ణ కుమారుడు శశిధర్ తో కలసి జనసేనలో చేరిపోయరు. అయితే 2019 ఎన్నికల్లో జనసేన ఓటమి పాలు అయింది.

ఇక ఎన్నికల తర్వాత చూసుకుంటే ఆంధ్రప్రభ యాజమాన్యం తన రూట్ కొంత మార్చుకుంది అని అంటున్నారు. అధికారంలో ఉన్న వైసీపీతో సన్నిహితంగా ముత్తా ఫ్యామిలీ ఉంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. ప్రభుత్వ సహాయం కోసమే ఈ విధంగా చేస్తున్నారు అని కూడా పేర్కొన్నారు. అయినప్పటికీ ముత్తా ఫ్యామిలీ ఈ రోజుకీ జనసేనలోనే ఉంది. 2024 ఎన్నికల్లో మరోసారి జనసేన తరఫున పోటీకి శశిధర్ రెడీగా ఉన్నారు.

మరి ఇంతలో ఈడీ దాడులు అది కూడా ముత్తా ఫ్యామిలీ టార్గెట్ గా జరుగుతున్నాయని అంటే మరి దీని వెనక ఏమిటి జరిగింది. అసలు తీగ ఏమిటి అన్నది ఎవరికీ అర్ధం కావడంలేదు. అయితే ఇప్పటిదాకా లిక్కర్ స్కాం అని చెబుతూ దాడులు చేస్తున్న దర్యాప్తు సంస్థలు ఇపుడు ఇతరత్రా కోణాలను పరిశీలించి కూడా దాడులకు ఉపక్రమిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా తీగ ఎక్కడో ఉంది. డొంక మాత్రం ఎప్పటికీ కదలదు, ఈ దాడులు మాత్రం ఎప్పటికపుడు సంచలనంగానే ఉంటున్నాయి. ఇది ఒక అంతులేని రాజకీయ కధగానే విశ్లేషణలు అయితే ఉన్నాయి మరి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.