దుబ్బాకతో సా 56 అసెంబ్లీ.. ఒక ఎంపీ స్థానానికి షెడ్యూల్

Tue Sep 29 2020 19:00:09 GMT+0530 (IST)

Dubbaka by election schedule released

వివిధ కారణాలతో ఖాళీ అయిన అసెంబ్లీ.. ఎంపీ స్థానాలను భర్తీ చేసేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాకతో సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ.. ఒక లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా షెడ్యూల్ ను విడుదల చేసింది. కీలకమైన పోలింగ్ తేదీని నవంబరు 3గా నిర్ణయించారు.ఈసీ వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం ఉప ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ ను అక్టోబరు 9న విడుదల చేస్తారు. నామినేషన్ల దాఖలకు ఆఖరు తేదీ అక్టోబరు16 కాగా.. నామినేషన్లను అక్టోబరు 17న చేపడతారు. నామినేషన్ల ఉప సంహరణకు అక్టోబరు 19 వరకు సమయం ఉంటుంది. పోలింగ్ ను నవంబరు 3న నిర్వహిస్తే.. ఓట్ల లెక్కింపును వారం తర్వాత అంటే నవంబరు 10న చేపడతారు.

బిహార్ రాష్ట్రానికి జరుగుతున్న ఎన్నికల ఫలితాలతో పాటుగా.. ఉప ఎన్నికల ఫలితాల్ని వెల్లడిస్తారు. ఉప ఎన్నికల్ని నిర్వహించే నియోజకవర్గాల్ని చూస్తే.. తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాకలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. తాజాగా షెడ్యూల్ విడుదల చేసిన ఉప ఎన్నికలు మొత్తం 11 రాష్ట్రాల్లో జరగనున్నాయి. మధ్యప్రదేశ్ లో అత్యధికంగ 27 స్థానాలకు జరగనున్నాయి. ఛత్తీస్ గఢ్.. గుజరాత్.. జార్ఖండ్.. హర్యానా.. కర్ణాటక.. మణిపూర్.. నాగాలాండ్.. ఒడిశా.. ఉత్తరప్రదేశ్ లలో ఎన్నికలు నిర్వహించనన్నారు.