Begin typing your search above and press return to search.

మోడి సిన్సియారిటిపై అనుమానాలు ?

By:  Tupaki Desk   |   4 Jun 2021 10:31 AM GMT
మోడి సిన్సియారిటిపై అనుమానాలు ?
X
వేల కోట్ల రూపాయలు దోచేసుకుని విదేశాలకు పారిపోయిన వాళ్ళను తిరిగి దేశానికి రప్పించే విషయంలో కేంద్రప్రభుత్వం చిత్తశుద్దిపైనే జనాలకు అనుమానాలు పెరిగిపోతున్నాయి. నీవవ్ మోడి, విజయామాల్య, మొహెల్ చోక్సీ లాంటి వాళ్ళు బ్యాంకుల్లో దాచుకున్న వేల కోట్లరూపాయల ప్రజాధనాన్ని దోచుకుని విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. నీరవ్ మోడి లండన్ లో ఉన్నారు. విజయామాల్య కూడా లండన్లోనే ఉన్నారు. అయితే చోక్సీ మాత్రం ప్రస్తుతానికి డొమినికాలో అరెస్టయి ఉన్నారు.

పై ముగ్గురు విదేశాలకు పారిపోయి సుమారు మూడేళ్ళవుతోంది. ఇంతవరకు వీళ్ళను తిరిగి భారత్ కు రప్పించేందుకు నరేంద్రమోడి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలేమిటో మామూలు జనాలకు అర్ధం కావటంలేదు. పై ముగ్గురి విషయంలో ఒకదాని తర్వాత మరొక కేసు నమోదవుతునే ఉంది. లండన్, డొమినికా కోర్టుల్లో విచారణ జరుగుతున్నది జరుగుతున్నదిగానే ఉంది.

ఇదిగో వాళ్ళందరినీ పట్టుకుని భారత్ కు రప్పించేస్తున్నారు, అదిగో తీసుకొచ్చేస్తున్నారంటూ ప్రచారం తప్ప మరికేమీ కనబడటంలేదు. ఇక్కడే కేంద్రప్రభుత్వం చిత్తశుద్ది మీద జనాలకు అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో మరో కీలకమైన అంశంపై జనాలకు కేంద్రం సమాధానం చెప్పుకోలేకపోతున్నది.

ఇంతకీ అంతటి కీలకమైన అంశం ఏమిటంటే విదేశాలకు పారిపోయిన వాళ్ళ సంగతిని పక్కన పెట్టేస్తే మనదేశంలోనే ఉన్నవాళ్ళ మాటేమిటి ? బ్యాంకుల్లో దాచుకున్న వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని పైన ముగ్గురు మాత్రమే దోచుకోలేదు. దేశంలోనే ఎంపిలుగా చెలామణి అవుతున్న ప్రజాప్రతినిధులు కోట్ల రూపాయలు దోచుకున్నారు. వీళ్ళపై సీబీఐ విచారణ జరిపి బ్యాంకులను దోచుకున్న విషయం నిర్ధారించింది కూడా.

బ్యాంకులను దోచుకున్న వాళ్ళు తమ కళ్ళ ముందే తిరుగుతున్నా మరి వాళ్ళపై కేంద్రం ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నది ? పైగా వీళ్ళు యధేచ్చగా ప్రధానమంత్రి, హోం శాఖ మంత్రి, లోక్ సభ స్పీకర్ లాంటి అత్యంత ప్రముఖులను తరచు కలుస్తునే ఉన్నారు. అంటే అధికారపార్టీలో ఉన్నవారు, లేదా అధికారపార్టీకి బాగా ఇష్టులైన వారు ఎంత దోచుకున్నా చర్యలుండవా ? ఇక్కడే మోడి సర్కార్ చిత్తశుద్దిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.