Begin typing your search above and press return to search.

నర్సాపురం ఉప ఎన్నిక డౌటే.. ?

By:  Tupaki Desk   |   14 Jan 2022 11:30 PM GMT
నర్సాపురం ఉప ఎన్నిక డౌటే.. ?
X
ఏపీలో అనుకోని సంఘటన ఏదైనా జరిగితే తప్ప ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు అనే అంటున్నారు. ఈ చర్చ ఎందుకు అంటే ఏపీలో తొందరలోనే నర్సాపురం లోక్ సభ సీటుకు ఉప ఎన్నిక వచ్చిపడుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో చెబుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సిట్టింగ్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజే చాటింపు వేస్తున్నారు. ఆయన తనను ఎంపీ పదవి నుంచి డిస్ క్వాలిఫై చేయించమని వైసీపీ నేతలు సవాల్ చేశారు. అందుకు ఫిబ్రవరి 5వ తేదే వరకూ డెడ్ లైన్ కూడా పెట్టేశారు. అప్పటిలోగా చేస్తే ఓకే, వైసీపీ వారిని మొనగాళ్ళు అని ఒప్పుకుంటాను అని కవ్విస్తున్నారు. లేకపోతే తానే రాజీనామా చేస్తాను అని అంటున్నారు.

నిజానికి రఘురామ క్రిష్ణం రాజు ఫిబ్రవరిలో రాజీనామా చేస్తారా అన్నది కూడా ఇపుడు చర్చగా ఉంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అదే నెలలో జరగబోతున్నాయి. ఆ సమావేశాలకు రఘురామ హాజరు అవుతారా లేదా అన్న దాని బట్టే ఆయన రాజీనామా అన్నది ఆధారపడి ఉంటుంది. ఆయన రాజీనామా మీద జాతీయ రాజకీయాల ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. బీజేపీ యూపీ ఎన్నికల్లో గెలిస్తే ఒకలా లేకపోతే మరోలా దేశ రాజకీయాలు ఉంటాయి. అందువల్ల ఆయన రాజీనామా అంశం కూడా దాని చుట్టే తిరిగినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.

అదెలా అంటే ఒక వేళ యూపీలో బీజేపీ గెలిస్తే రాజు గారు రాజీనామా ఠక్కున చేస్తారు. అపుడు స్పీకర్ ఆమోదించడం కూడా జరిగిపోతుంది. ఏపీలో కూడా ఆ ఊపులో ఉప ఎన్నికలు వచ్చేస్తాయి. దాంతో ఏపీలో రాజు గారి హవా కూడా ఒక లెక్కన సాగుతుంది. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా అందులో బీజేపీ కూడా ఉంటుంది కాబట్టి ఆ క్రెడిట్ ఎంతో కొంత తమకు ఉంటుందని చెప్పుకుంటుంది.

అదే యూపీలో బొమ్మ తిరగబడితే మాత్రం బీజేపీ లెక్కలు మారిపోతాయి. బీజేపీ వద్ద వైసీపీ పట్టు రాజకీయంగా పెరుగుతుంది. అపుడు జగ‌న్ని ఇబ్బంది పెట్టే చర్యలకు బీజేపీ సాహసించకపోవచ్చు అంటున్నారు. దాంతో రాజు గారు చిత్తశుద్ధితో రాజీనామా అస్త్రం ప్రయోగించినా అది స్పీకర్ వద్ద పెండింగులో ఉంటుంది తప్ప ఎటూ తేలని వ్యవహారం అవుతుంది అన్న మాట కూడా వినిపిస్తోంది.

మొత్తానికి రాజు గారి రాజీనామాను బీజేపీ తనకు అనుకూలంగా వాడుకునే సీన్ ఉన్నపుడే ముందుకు తెస్తుంది అంటున్నారు. లేకపోతే ఆ అంశాన్ని అసలు టచ్ చేయదని కూడా చెబుతున్నారు. ఇక ఒక సభ్యుడు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా కూడా తాను కోరుకున్నపుడు రాజీనామా చేసి ఉప ఎన్నికలను తెచ్చే సీన్ అయితే ఏ రోజూ ఉండదు. తెలంగాణాలో సీనియర్ నేత ఈటెల రాజెందర్ రాజీనామాను టీయారెస్ కూడా కోరుకోబట్టే అది స్పీకర్ ఆమోదం పొంది అక్కడ ఉప ఎన్నిక జరిగింది అని గుర్తు చేసుకోవాలి. మొత్తానికి రాజు గారు చెబుతున్నట్లుగా నర్సాపురం ఉప ఎన్నిక జరగాలీ అంటే దానికి చాలా పొలిటికల్ ఈక్వేషన్స్ పని చేయాలి అనే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.