Begin typing your search above and press return to search.

గాడిద పాల సబ్బులు.. అప్పుడు నవ్విన వాళ్లే ఇప్పుడు అభినందిస్తున్నారు

By:  Tupaki Desk   |   17 Sep 2021 12:30 AM GMT
గాడిద పాల సబ్బులు.. అప్పుడు నవ్విన వాళ్లే ఇప్పుడు అభినందిస్తున్నారు
X
ఒక్క ఐడియా చెప్పగానే అందరూ విర‌గ‌ప‌డి నవ్వారు.. కుటుంబ సభ్యులు, స్నేహితులు అనే తేడా లేకుండా అందరూ ఎగతాళి చేసిన వారే. ‘‘గాడిద పాలతో సబ్బులు చేస్తావా...ఆపై లాభాలు గడిస్తావా..’’అంటూ మొహమ్మీదే ఎక‌సెక్కాలు ఆడారు. క‌రెక్టుగా ఏడాది కిత్రం..ఇటువంటి ప్రతికూలత మధ్య అతడు తన వ్యాపారాన్నిప్రారంభించాడు. ఇప్పుడు అతడు పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తూ.. భారీ స్థాయిలో లాభాలు గడిస్తున్నాడు.

జోర్డాన్‌కు చెందిన 32 ఏళ్ల యువ‌కుడు ఎమాద్ అట్టియట్ సక్సెస్ క‌థ ఇదే. ఇటువంటి బిజినెస్‌లోకి దిగాడంటే.. ఎమాద్‌ది వ్యవసాయం నేపథ్యం అనుకుంటే మనం త‌ప్పులో కాలేసిన‌ట్టే..! ఎందుకంటే.. అతడు మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో పోస్ట్ గ్రాడ్యువేట్ చేశాడు. అయితే.. తన చదువుకు తగ్గ జాబ్ దొరక్క చాలా కాలం పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరికి తన తల్లి సలహా మేరకు ఎమాద్ ఈ బిజినెస్‌లోకి దిగి విజయం సాధించాడు.

గాడిద పాలతో సబ్బులు చేయాలన్న ఐడియా మొదట ఎమాద్ తల్లికి వచ్చింది. ఈ ఆలోచ‌న సాధ్యా అసాధ్యాలపై వారు కొంత కాలం ప‌రిశీలించుకున్నాక ప‌నిలోకి దిగారు. అప్పటి వరకూ జోర్డాన్‌ లో ఎవ్వరూ కూడా గాడిద పాల సబ్బుల గురించి వినలేదు. దీంతో.. అతడి ఆలోచ‌న విని పెదవి విరిచిన వారు..నిరుత్సాహపరిచిన వారే ఎక్కువ. అయితే.. ఎన్ని విమర్శలు, నెగెటివ్ కామెంట్స్ వచ్చినా కూడా వారు వెనకడుగు వేయక తమ ఐడియాపై అచంచల విశ్వాసంతో ముందుకెళ్లారు.

ఫలితం.. సంవ‌త్స‌రం తిరిగే సరికల్లా వారు మంచి లాభాలు కళ్లజూడటం ప్రారంభించారు. ఎమాద్ ప్రారంభించిన సంస్థ పేరు అటాన్ డాంకీ మిల్క్ స‌బ్బులు. అరబ్బీలో అటాన్ అంటే ఆడ గాడిద అని అర్థం. అమ్మాన్‌ కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న మడాబా అనే ప్రాంతంలో వీరు 12 గాడిదలను పెంచుతున్నారు. ఒక్కో గాడిద రోజుకు రెండు లీటర్ల మిల్క్ ఇస్తుంది. లీటరు పాల కోసం రోజులో మూడు సార్లు ఎలక్ట్రానిక్ హ్యాండ్ పంప్ సాయంతో అక్కడి సిబ్బంది పాలు పిండుతారు.

మిగతాది గాడిద పిల్లల కోసం వదిలేస్తారు. ఇలా వచ్చిన పాలను శీతలీకరించాక వాటిని జోర్డాన్ రాజధానిలో ఉన్న ప్రాసెసింగ్ సెంటర్‌కు తరలిస్తారు. అక్కడ ఎమాద్ తల్లి స్వీయ పర్యవేక్షలో ఈ సబ్బులు తయారవుతాయి. కానీ చూశారా అంద‌రు చేసిన ప‌ని చేస్తే ఏముంటంది. ఎవ‌రూ న‌డ‌వ‌ని దారిలో న‌డ‌వాలి. అలా న‌డిస్తేనే విజ‌యమైనా ఓట‌మైనా కొత్త‌గా ఉంట‌ది. అట్లాంటిదే ఈ ఐడియా చూశారా. ఆ యువ‌కుడు ఎంటి విజ‌యాన్ని సాధించాడో.. మొద‌ట ఆయ‌న‌న‌ను నిరుత్సాహ‌ప‌రిచిన‌వారే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు.

ఇప్ప‌టి యువ‌కులు ఎక్క‌డో ఓ చోట ఉద్యోగం చేస్తూ కాలం వెళ్ల‌దీస్తున్నారు. కొద్ది మాత్ర‌మే సొంత వ్యాపారాలు చేస్తూ పైకి వ‌స్తున్నారు. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఒక‌రికి ఉద్యోగం ఇవ్వాలే త‌ప్పా ఉద్యోగం చేయ‌కూడ‌ద‌నే భావ‌న కూడా మొద‌ల‌వుతోంది. దీనివ‌ల్ల చిన్న వ‌య‌స్సులోనే పెద్ద వ్యాపార వేత్తలుగా ఎదిగి చాలా మందికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. అంద‌రూ ఇలాగే కొత్త ఐడియాలతో దూసుకెళ్లాల‌ని ప‌లువ‌రు సూచిస్తున్నారు.