ట్రంప్ సంచలన నిర్ణయం!

Fri May 29 2020 22:44:01 GMT+0530 (IST)

Donald Trump signs executive order targeting social media

అమెరికా అధ్యక్షుడికి - మీడియాకు మధ్య చాలా కాలంగా వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అది ఈ మధ్య తీవ్ర రూపం దాల్చింది. అమెరికాలో కరోనాను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడంటూ ట్రంప్ మీద విరుచుకుపడుతోంది అక్కడి మీడియా. వాళ్లపై ట్రంప్ కూడా అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తున్నాడు. కానీ మీడియాదే పైచేయిగా నిలుస్తోంది. ఆయన రోజు రోజుకూ అన్ పాపులర్ అయిపోతున్నాడు. ఈ ప్రభావం రాబోయే అధ్యక్ష ఎన్నికల్లోనూ ఉంటుందంటున్నారు. ఆ సంగతలా ఉండగా.. ట్రంప్ ఇటీవల సోషల్ మీడియా సంస్థల మీదా యుద్ధం ప్రకటించారు. ఈ మధ్యే తాను ట్విటర్‌లో చేసిన కామెంట్ పై ట్విటర్ ఫ్యాక్ట్ చెక్ చేపట్టడాన్ని ట్రంప్ తీవ్రంగా పరిగణించారు. సోషల్ మీడియాపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు  అన్నంత పనీ చేశారు. సోషల్ మీడియా సంస్థలకు అడ్డుకట్ట వేసే దిశగా ఒక కీలక చట్టం తీసుకొచ్చారు. సామాజిక మాధ్యమ సంస్థలకు ఇప్పటి వరకు ఉన్న చట్టపరమైన రక్షణలను తొలగిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేశారు. సామాజిక మాధ్యమ సంస్థల్లో పోస్ట్ చేసిన కంటెంట్ ను అవి తనిఖీ చేస్తే చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉపయోగపడుతుందని ట్రంప్ అన్నారు. వ్యక్తుల లేదా గ్రూపుల మధ్య జరిగే చర్చలను మార్పు చేయడం తొలగించడం - దాచి పెట్టడం - నియంత్రించడం వంటి చర్యలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ ఆర్డర్ అని ట్రంప్ చెప్పాడు. దీనిపై సోషల్ మీడియా సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి.