Begin typing your search above and press return to search.

అమెరికాలో అమల్లోకి డిఫెన్స్ ప్రొడక్షన్ చట్టం అర్థమేంది?

By:  Tupaki Desk   |   29 March 2020 3:30 AM GMT
అమెరికాలో అమల్లోకి డిఫెన్స్ ప్రొడక్షన్ చట్టం అర్థమేంది?
X
ఊహించని రీతిలో కరోనా ఉత్పాతం అమెరికాను ముంచేస్తోంది. ప్రపంచంలోనే అగ్రరాజ్యంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలకు షాక్ తింటోంది ప్రపంచం. పెద్దన్న హోదాలో ఉన్న అమెరికాలో ఇలాంటి పరిస్థితులా? కంటికి కనిపించని ఒక వైరస్ అమెరికాను ఇంతలా అతలాతకుతలం చేయటమా? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి. తాము ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల్లో పాత చట్టాన్ని కొత్తగా తెర మీదకు తీసుకురావటమేకాదు.. తక్షణమే దాన్ని అమల్లోకి తెచ్చేశారు.

కరోనా మీద యుద్దం చేసేందుకు వీలుగా.. దేశంలోని వనరులన్నింటిని ఒక్కతాటి మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవిధంగా చూస్తే.. హాలీవుడ్ సినిమాల్లో పరిస్థితి చేయి దాటే సమయంలో.. ఉన్నవనరుల్నింటిని రంగంలోకి దించే ప్రయత్నం చేస్తారు చూశారా? దాదాపుగా అలాంటి పరిస్థితే ఇప్పుడు అమెరికా చేస్తోంది.

తాజాగా అమెరికాలో డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ ను అమల్లోకి తీసుకొచ్చేశారు. చాలా అరుదుగా మాత్రమే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తారు. కరోనా వేళ.. ఇప్పుడున్న పరిస్థితిని అధిగమించటానికి ఉన్న మార్గాల్లో ఇదొకటిగా చెబుతున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే.. మరే అవకాశం లేని వేళ.. ఆఖరి అస్త్రంగా దీన్ని వాడతారు. ఈ చట్టం అమల్లోకి వచ్చాక.. సైన్యం మొదలు.. అన్ని కంపెనీలు ప్రభుత్వం కోరిన వాటి మీదనే ఫోకస్ చేయాలి.

అమెరికన్ ఆర్మీలోని ఇంజినీర్ల టీం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్ని నిర్మించేందుకు వీలుగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. ప్రముఖ వాహన తయారీ సంస్థ జనరల్ మోటార్స్.. కరోనా కారణంగా రోగుల ప్రాణాల్ని రక్షించే వెంటిలేటర్ల తయారీ మీద ఫోకస్ పెట్టనుంది. ఫిలిప్స్.. మెడ్ ట్రోనిక్.. హామిల్టన్.. జోల్.. రెడ్ మెడ్ తో పాటు పలు కంపెనీలు ఇలాంటి పనుల్లోనే మునిగి తేలనున్నాయి. రానున్న వారంలో లక్ష వెంటిలేటర్లను అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఇప్పుడున్న అపత్ కాలంలో వైద్యుల ఆరోగ్యం చాలా కీలకం. అందుకే.. వారి ముఖానికి రక్షణ కవచాలు అందించేందుకు వీలుగా.. ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా వైద్య సామాగ్రిని.. మందుల్ని పంపిణీ చేసేందుకు వీలుగా అతి పెద్ద కార్గో విమానం డ్రీమ్ లిఫ్టర్ ను ప్రభుత్వానికి ఇవ్వటానికి ఓకే చెప్పింది. ప్రముఖ గ్యాడ్జెట్ సంస్థ యాపిల్ సైతం సీడీసీ.. ఫెమాలతో కలిసి కరోనా కట్టడిలో ఉపయోగపడే టూల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇలా పెద్ద పెద్ద కంపెనీలు తమ పనులు వదిలేసి.. వైద్య పరికరాలు.. సదుపాయాలకు అవసరమైన అంశాల మీద ఫోకస్ చేస్తున్నాయి.