Begin typing your search above and press return to search.

ట్రంపూ..ఈ బడాయిలేందండీ?

By:  Tupaki Desk   |   22 Feb 2020 5:37 PM GMT
ట్రంపూ..ఈ బడాయిలేందండీ?
X
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా భారత పర్యటనకు వస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ కు గుర్తుండిపోయే స్వాగతం పలికేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్థాయికి మించి ఏర్పాట్లు చేస్తున్నారు. దానితో సరిపెట్టుకుంటే బాగుండేదే. కానీ... బిజినెస్ మ్యాన్ గా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన ట్రంప్... తనకు భారత్ లో దక్కనున్న అపురూర స్వాగతాన్ని చిలువలు పలువలు చేసేస్తున్నారు. అంతేనా... తాను పర్యటించనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకంటే కూడా ఓ మెట్టు కిందే ఉన్నారంటూ తనదైన శైలి వ్యాఖ్యలు చేస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. ఈ తరహా వైనం ట్రంప్ ను ఓ రేంజిలో విమర్శలకు గురి చేస్తోందని చెప్పక తప్పదు.

అయినా ట్రంప్ బడాయి ఏ స్థాయి దాకా వెళ్లిందన్న విషయానికి వస్తే... సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్‌ బుక్‌’లో ఫాలోవర్ల పరంగా తాను ప్రథమ స్థానంలో ఉన్నానని ట్రంప్ మరోసారి చెప్పుకున్నారు. రెండో స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆయా దేశాల జనాభాను ప్రస్తావిస్తూ.. 150 కోట్లమంది భారతీయులుండటం మోదీకి సానుకూలంగా మారిందని కూడా మరో కీలక వ్యాఖ్య చేసి అడ్డంగా బుక్కైపోయారు. లాస్‌ వేగాస్‌ లో గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈ మధ్య ఫేస్‌ బుక్‌ చీఫ్‌ జుకర్‌ బర్గ్‌ నన్ను కలిశారు. అభినందనలు తెలిపారు. ఎందుకని ప్రశ్నించా. ఫేస్‌ బుక్‌ లో మీరే నెంబర్‌ వన్‌ అన్నారు’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ట్విటర్‌లో కూడా నేనే నెంబర్‌ వన్‌ అని చెప్పిన ట్రంప్.. ఈ విషయాన్ని మోదీతో కూడా చెప్పానని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ట్రంప్ ఏమన్నారంటే... ‘‘వచ్చేవారం భారత్‌ వెళ్తున్నా. వారి జనాభా 150 కోట్లు. ఆ దేశ ప్రధాని ఫేస్‌బుక్‌లో రెండో స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో ఉన్నదెవరో తెలుసా? ట్రంప్‌. మీరు నమ్ముతారా? నెంబర్‌ వన్‌ ట్రంప్‌. ఇది అబద్ధం కాదు.. అబద్దమైతే మీడియాకు బ్రేకింగ్‌ న్యూస్‌ అవుతుంది కదా. ఫేస్‌ బుక్‌ లో రెండో స్థానంలో ఉండటంపై మోదీని అభినందించాను. మీ జనాభా 150 కోట్లు. మీరు రెండో స్థానంలో ఉన్నారు. మా జనాభా 35 కోట్లు. నేను ప్రథమ స్థానంలో ఉన్నాను అని ఆయనతో చెప్పాను’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. గతంలోనూ పలు సందర్భాల్లో ఫేస్‌బుక్‌లో నెంబర్‌ 1గా ఉన్నానంటూ ట్రంప్‌ చెప్పుకున్నారు. కాగా, అధికారిక లెక్కల ప్రకారం భారత జనాభా సుమారు 130 కోట్లు. అలాగే, ఫేస్‌ బుక్‌ లెక్కల ప్రకారం, శుక్రవారం నాటికి ప్రధాని ఫేస్‌ బుక్‌ లో మోదీని అనుసరిస్తున్నవారి సంఖ్య 4.4 కోట్లు. కాగా, ట్రంప్‌ ఫాలోవర్ల సంఖ్య 2.7 కోట్లు మాత్రమే. వాస్తవమైన ఈ ఫిగర్స్ తో ఎంతమాత్రం సంబంధం లేనట్టుగా వ్యవహరించిన ట్రంప్ పై ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది.