ట్రంప్ మనసు గెలిచిన ముకేష్ అంబానీ..ఎలాగంటే!

Wed Feb 26 2020 10:15:30 GMT+0530 (IST)

Donald Trump interacts with business leaders in Delhi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో సీఈవోల సదస్సులో ఆసక్తిదాయకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికాధ్యక్షులు ఇండియా వచ్చిన సందర్భాల్లో భారత వ్యాపార వేత్తలతో సమావేశాలు అవుతూ వస్తున్నారు. ఇది వరకూ బరాక్ ఒబామా ఇండియాకు వచ్చి మొత్తం వ్యాపార వేత్తల మీదే కాన్సన్ ట్రేట్ చేశారు. తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని అప్పట్లో ఒబామా భారత వ్యాపారత్తలను కోరారు. అనేక ఒప్పందాలను కుదుర్చుకుని వెళ్లారు. అప్పుడు ఒబామా కేవలం పెట్టుబడులను ఆహ్వానించడం మీదే దృష్టి పెట్టారు. కాస్త భిన్నంగా అయినా ట్రంప్ కూడా పెట్టుబడులు పెట్టాలంటూ భారత వ్యాపారవేత్తలను కోరారు.అయితే ట్రంప్ దగ్గర అర్రీబుర్రీ వ్యాపార వేత్తలు కాదు.. ఇండియాలోనే టాప్ టైకూన్స్ మాత్రమే కనిపించారు. అది కూడా సాధారణ వ్యక్తుల్లా వాళ్లు ట్రంప్ ముందు కూర్చున్నారు. ట్రంప్ వేదిక మీద తమదేశంలో ఉన్న అవకాశాల గురించి వివరిచగా వీరు సావధానంగా విని మైకులు తీసుకుని తాము చెప్పదలుచుకున్నదీ చెప్పారు. ఈ క్రమంలో భారత కుభేరుడు ముఖేష్ అంబానీ చెప్పిన ఒక మాట ట్రంప్ ను సంతోష పెట్టి ఉండవచ్చు. తమ జియో గురించి అంబానీ చెప్పారు.

దేశంలో జియో కు ఉన్న నెట్ వర్క్ గురించి వివరించడం ట్రంప్ ను ఆనంద పెట్టి ఉండదు. అయితే జియో విషయంలో చైనా గూడ్స్ ఏదీ వాడటం ఉండదని అంబానీ వివరించడమే ట్రంప్ కు ఆనందకరమైన ముచ్చట. జియో నెట్ వర్క్ కు సంబంధించి కానీ జియో ఫోన్లకు సంబంధించి కానీ.. ఎక్కడా చైనా వస్తువులను వాడే సమస్యే లేదని అంబానీ చెప్పారట. దేశంలో చైనా గూడ్స్ జీరో పర్సెంటేజ్ కూడా వాడని ఏకైక నెట్ వర్క్ జియో మాత్రమే అని ట్రంప్ కు అంబానీ వివరించారు ఆ సమావేశం లో. ఇది ట్రంప్ ను ఆకట్టుకుంది.

మొబైల్ స్మార్ట్ ఫోన్ నెట్ వర్క్స్ విషయంలో..చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టాలనేది అమెరికా డ్రీమ్. ఈ విషయంలో ఇండియా మీద కూడా అమెరికా ఒత్తిడి చేస్తూ ఉంది. చైనా స్మార్ట్ ఫోన్ మేకర్స్ ను దూరం పెట్టాలని కోరుతూ ఉంది యూఎస్. అయితే చౌకధరలతోనే ఎక్కువ ఫీచర్స్ ఇచ్చే స్మార్ట్ ఫోన్స్ గా చైనా కంపెనీలు ఇండియాలో తిష్ట వేశాయి.