Begin typing your search above and press return to search.

చైనాతో ట్రంప్ లింకులు.. బయటపడ్డ నిజాలు!

By:  Tupaki Desk   |   18 Jun 2020 1:10 PM GMT
చైనాతో ట్రంప్ లింకులు.. బయటపడ్డ నిజాలు!
X
పొద్దున లేస్తే చాలు కరోనా వైరస్ ను పుట్టించిన చైనాపై ఒంటికాలిపై లేచే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తాజాగా ట్రంప్ నిజస్వరూపంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

2019లో జీ-20 సమావేశంలో వాణిజ్య చర్చల సందర్భంగా అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ గెలిచేందుకు తనకు సహాయం అందించాలంటూ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు ట్రంప్ విజ్ఞప్తి చేశారంటూ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ బాంబు పేల్చారు. ట్రంప్-జిన్ పింగ్ మధ్య ఈ అంశం చర్చకు వచ్చిందన్నారు. చైనా ఆర్థిక సామర్థ్యాన్ని సూచిస్తూ తాను గెలవడానికి సహకరించాలంటూ జిన్ పింగ్ కు విజ్ఞప్తి చేశారని పేర్కొన్నారు.

జాన్ బోల్టన్ తాజాగా రాసిన ‘రూమ్ వేర్ ఇట్ హ్యాపెన్డ్’ పుస్తకం ఆవిష్కరణలో మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నవంబర్ లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించేందుకు ట్రంప్ ఏకంగా ప్రత్యర్థి చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ సహాయాన్ని కోరాడని ఆయన ఆరోపించారు. అమెరికా పాలనను ఎలా నడిపించాలన్న దానిపై ట్రంప్ కు ఎటువంటి క్లారిటీ లేదని జాన్ బోల్టన్ ఆరోపించారు.

దీనిపై ట్రంప్ ప్రత్యర్థి, డెమోక్రటిక్ అభ్యర్థి జోబిడెన్ స్పందించారు. ‘ట్రంప్ చైనా సహాయం కోరి ఉంటే నిజంగా ఇది క్షమించరానిది అని.. అమెరికా ప్రయోజనాలను పరిరక్షించడంలో విలువలు కాపాడడంలో ట్రంప్ విఫలమయ్యాడు’ అని ఆరోపించారు. 2018 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ట్రంప్ జాతీయ సలహాదారుగా బోల్టన్ పనిచేశారు. ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుటు ట్రంప్ ను తీవ్రంగా ఇరుకున పెట్టగా.. అమెరికాలో చర్చనీయాంశమయ్యాయి.