Begin typing your search above and press return to search.

చైనాతో వివాదం: మోడీ మూడ్ అంత బాగోలేదు ...ట్రంప్ సంచలన వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   29 May 2020 5:45 AM GMT
చైనాతో వివాదం: మోడీ మూడ్ అంత బాగోలేదు ...ట్రంప్ సంచలన వ్యాఖ్యలు !
X
భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం పరిష్కారానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మధ్యవర్తిత్వం అంశం ప్రస్తావించారు. ఇరు దేశాల సమస్య పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అంతేకాదు, భారత్, చైనా మధ్య కొనసాగుతున్న సంఘర్షణ గురించి ప్రధాని నరేంద్ర మోదీతో తాను మాట్లాడానని, తాజా పరిణామాలపై ఆయన మంచి మూడ్‌లో లేరని ట్రంప్ అన్నారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలో గురువారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ... భారత్, చైనాల మధ్య పెద్ద వివాదం కొనసాగుతోందని వ్యాఖ్యానించారు.

కాగా, భారత్- చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తున్నాయి. భారత్‌తో యుద్ధానికి దిగడానికి చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్‌పింగ్ ఇదివరకే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ ఏ )కు సంకేతాలను ఇచ్చారు. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు చైనా సరిహద్దుల్లో నెలకొన్నాయి. వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ చైనా సరిహద్దులను దాటుకుని భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడం.. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, లడక్ వంటి చోట్ల మనదేశ సరిహద్దు భద్రతా బలగాలతో ఘర్షణకు దిగడం వంటి పరిణామాలు చాలాదూరం వెళ్తాయని ట్రంప్ ఆరంభంలోనే అంచనా వేశారు. అందుకే చైనాతో వైరం కొనసాగుతున్నప్పటికీ, మధ్యవర్తిత్వాన్ని వహించడానికి ముందుకొచ్చారు.

ట్రంప్ మాట్లాడుతూ ..భారత్, చైనాల మధ్య పెద్ద సంఘర్షణ నెలకుంది.. ఇరు దేశాల్లోనూ ఒక్కొక్కరికి 1.4 బిలియన్ల జనాభా ఉంది... ఇరువురికీ శక్తివంతమైన సైనిక సామర్థ్యం కూడా ఉంది.. భారత్ సంతోషంగా లేకపోతే చైనా కూడా సంతోషంగా ఉండదు అని అన్నారు. నేను మీకు చెప్పగలను.. నేను ప్రధాని మోదీతో మాట్లాడాను. చైనాతో ఏం జరుగుతుందో.. ఆయన మంచి మూడ్ ‌లో లేరు అని అన్నారు. అమెరికా కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం ఆయన వైట్ ‌హౌస్ ఓవల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రస్తుతం నెలకొన్న ఈ పరిణామాల పట్ల భారత్ ఏ మాత్రం సంతోషంగా లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అటు చైనా కూడా సంతోషంగా ఉండకపోవచ్చని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం మంచి పరిణామం కాదని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక ఈ నేపథ్యంలో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి భారత్ ఓ అడుగు ముందుకేసింది. ద్వైపాక్షిక చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నామంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ ట్వీట్ చేశారు. దీనికి చైనా తరఫు నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ.. తమవంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్నామని, యుద్ధ వాతావరణాన్ని, ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించడానికి అన్ని చర్యలను తీసుకుంటున్నామని శ్రీవాస్తవ్ వెల్లడించారు. యుద్ధానికి దిగాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదని తేల్చి చెప్పారు