Begin typing your search above and press return to search.

ట్రంప్ భారత్ టూర్: భారీ రోడ్డు షో ఉంటుందా, సబర్మతికి వెళ్తారా?

By:  Tupaki Desk   |   23 Feb 2020 2:37 PM GMT
ట్రంప్ భారత్ టూర్: భారీ రోడ్డు షో ఉంటుందా, సబర్మతికి వెళ్తారా?
X
తాను భారత్‌లోకి అడుగుపెట్టగానే 70 లక్షలమందితో స్వాగతం పలుకుతానని ప్రధాని మోడీ మాటిచ్చారని, 70 లక్షలు కాదు.. కోటిమంది భారతీయులు తన రాక కోసం అహ్మదాబాద్‌లో ఎదురు చూస్తారనుకుంటున్నానని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు చేశారు. దీంతో అహ్మదాబాద్ రోడ్డు షోకు భారీ ఎత్తున తరలి వస్తారని భావించారు. అయితే ట్రంప్... మహాత్ముడి సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించనున్న నేపథ్యంలో రోడ్డు షో రద్దు కావొచ్చు లేదా 22 కిలోమీటర్లకు బదులు 9 కిలోమీటర్లకు కుదించే విషయమై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. రోడ్డు షో ఉంటుందా లేక సబర్మతి ఆశ్రమానికి వెళ్తారా షెడ్యూల్ ఖరారు కాలేదు.

ట్రంప్ సోమవారం ఉదయం గం.11.55కు అహ్మదాబాదుకు వస్తారు. తొలుత సబర్మతీ ఆశ్రమ సందర్శనతో ఆయన పర్యటన ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ అధికారిక ప్రకటన ఖరారు చేశారు. ట్రంప్ విమానాశ్రయం నుండి మోతేరా స్టేడియం వరకు మోడీతో కలిసి భారీ రోడ్డు షో నిర్వహిస్తారు. రోడ్డు షో.. సబర్మతి సందర్శనం విషయంలో తర్జన భర్జన పడుతున్నారు. అయితే ప్రపంచానికి ఆదర్శనీయుడైన గాంధీ సబర్మతిని సందర్శనను ట్రంప్ రద్దు చేసుకోకపోవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు షో రద్దు లేదా కుదించడం జరగనుంది.

ఆ తర్వాత ట్రంప్ - మోడీలు మోతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొంటారు. ట్రంప్ సబర్మతి నుండి రోడ్డు షో తర్వాత స్టేడియంకు వస్తారా లేక రోడ్డు షో తర్వాత సబర్మతి నుండి స్టేడియంకు వస్తారా తెలియాల్సి ఉంది.

సోమవారం ఉదయం గం.11.55 నిమిషాలకు ట్రంప్ అహ్మదాబాద్ చేరుకుంటారు. గం.12.00 సమయానికి ఎయిర్ పోర్ట్ నుండి మోడీతో కలిసి రోడ్డు షో నిర్వహిస్తారు. అదే సమయంలో సబర్మతిని సందర్శించవచ్చు. గం.12.30 సమయానికి నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం గం.3.30 సమయానికి అహ్మదాబాద్ నుండి ఆగ్రా చేరుకుంటారు. సాయంత్రం గం.5.10కి తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. రాత్రి గం.7.30కి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి గం.7.45కు మౌర్య హోటల్‌కు చేరుకుంటారు. ఇక్కడే ట్రంప్ దంపతులు బస చేస్తారు.

రెండో రోజు ఉదయం గం.9.55కు రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు సైనికుల గౌరవ వందనం. గం.10.45 సమయానికి రాజ్‌ఘాట్‌లో నివాళులు. మధ్యాహ్నం గం.11.25 సమయానికి హైదరాబాద్ హౌస్‌లో మోడీ-ట్రంప్ ఉమ్మడి మీడియా సమావేశం. ద్వైపాక్షిక చర్చలు. ఆ సమయంలో మెలానియా ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం గం.12.55 సమయానికి అమెరికా ఎంబసీ సిబ్బందితో ట్రంప్ భేటీ. రాత్రి గం.8.00కి రాష్ట్రపతి భవన్‌ లో ట్రంప్ దంపతులకు విందు. రాత్రి గం.10.00 సమయానికి అమెరికాకు బయలుదేరుతారు.