Begin typing your search above and press return to search.

అమెరికన్లకు షాకిచ్చేలా ట్రంప్ నిర్ణయం.. కరోనా వేళ తప్పదంతే..

By:  Tupaki Desk   |   31 March 2020 7:12 AM GMT
అమెరికన్లకు షాకిచ్చేలా ట్రంప్ నిర్ణయం.. కరోనా వేళ తప్పదంతే..
X
వందల కోట్ల జీవరాశులు ఉన్నా.. అవేవీ తన మేధస్సు ముందు నిలవలేవన్న మనిషి ఇగోను కరోనా ఎంత దారుణంగా డ్యామేజ్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంటికి కనిపించేలా ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది. ఎప్పుడైతే కంటికి కనిపించకపోవటమే కాదు.. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే కరోనా వైరస్ లెక్క తేల్చటానికి మనిషికి అందుబాటులో ఉన్న వనరులేమీ సరిపోని దుస్థితి నెలకొంది. దీంతో.. ఏం చేయాలో పాలుపోవటం లేదు. కరోనాను తక్కువగా అంచనా వేసిన ప్రతిఒక్కరూ ఇబ్బందికి గురైన వారే.

ఎవరిదాకానో ఎందుకు అగ్రరాజ్యం అమెరికా సంగతే చూడండి. ఓపక్క చైనా.. మరోవైపు యూరప్ అతలాకుతలమవుతుంటే.. అగ్రరాజ్యాధిపతి ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తుకు తెచ్చుకుంటే ఎంత బడాయికి పోయారో అర్థమవుతుంది. కరోనా కలకలాన్ని తాను ఒప్పుకుంటానంటూనే..అందుకోసం అన్ని ఆపేస్తామా? అంటూ అతిశయపు మాటలు ఆ దేశాన్ని దారుణంగా దెబ్బ తీశాయి. కరోనా విషయంలో కాస్త తగ్గి ఉండాలన్న ప్రాథమిక నిబంధనను పాటించని అగ్రరాజ్యం భారీ మూల్యాన్ని చెల్లించిందనే చెప్పాలి.

ఇప్పుడా దేశంలో ఏకంగా 1.60లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైతే.. మూడున్నర వేలకు పైనే మరణాలు చోటు చేసుకున్నాయి. రానున్న రోజుల్లో ఈ అంకెలు ఏమైనా తగ్గుతాయా? అన్న ఆశ కూడా లేదు. ఇలాంటివేళ.. కఠిన వాస్తవాన్ని అంగీకరించక తప్పనిసరి పరిస్థితుల్లో ట్రంప్ తన తీరును మార్చుకోక తప్పలేదు. తొలుత ఆయన అనుకున్నట్లుగా అమెరికన్లు జరుపుకునే ఈస్టర్ నాటికి పరిస్థితి అంతా చక్కదిద్దుకుంటుందని ట్రంప్ అంచనా వేశారు.

అయితే.. అది కాస్తా అట్టర్ ప్లాప్ కావటమే కాదు.. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత భయానకంగా మారే అవకాశం ఉందంటున్నారు. దీంతో.. తాజాగా కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. సామాజిక దూరాన్ని తొలుత అనుకున్నట్లుగా ఏప్రిల్ 15 వరకు కాకుండా.. నెలాఖరు వరకూ కొనసాగించాలని ప్రభుత్వం అనుకున్నట్లుగా ట్రంప్ సర్కారు వెల్లడించింది. ఇప్పుడున్న తీవ్రత కొనసాగితే రానున్న రెండు వారాల వ్యవధిలో అమెరికాలో తక్కువలో తక్కువగా లక్ష నుంచి రెండు లక్షల మరణాలు చోటు చేసుకునే వీలుందన్న హెచ్చరికల నేపథ్యంలో సామాజిక దూరాన్ని నెలాఖరు వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో.. న్యూయార్క్.. న్యూజెర్సీ.. కనెక్టిట్ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎక్కడి వారు అక్కడే ఉండాలని.. వేరే ప్రాంతాలకు వెళ్లొద్దన్న ఆదేశాల్ని జారీ చేసింది ట్రంప్ సర్కార్.