Begin typing your search above and press return to search.

ట్రంప్ మొండితనాన్ని మార్చిన కోవిడ్..భారతీయులకు గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   13 Aug 2020 5:45 AM GMT
ట్రంప్ మొండితనాన్ని మార్చిన కోవిడ్..భారతీయులకు గుడ్ న్యూస్
X
రాజు ఎంత మొండోడైనా.. తనకు అనుకూలంగా గాలి వీయటం లేదన్నందన్న విషయాల్ని గుర్తిస్తే.. దిద్దుబాటు చర్యల్ని చేపట్టటం మామూలే. ఇందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం మినహాయింపు కాదు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. అమెరికన్లను సంతోష పెట్టటం కోసం వీసా విధానంలో పలు మార్పులు తేవటమే కాదు.. అమెరికాకు వచ్చే విదేశీ ఉద్యోగులకు ఆయన వరుస షాకులు ఇస్తూ నిర్ణయాల్ని తీసుకోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే మాయదారి కరోనా ఆయన ఆశలకు చెక్ పెట్టటమే కాదు.. తన నిర్ణయాల్ని మార్చుకునే పరిస్థితుల్ని తీసుకొచ్చింది.

ఈ నేపథ్యంలో.. ట్రంప్ సర్కారు తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తమ దేశంలోకి వచ్చే హెచ్ 1బీ వీసాదారులకు ఊరటనిచ్చేలా అమెరికా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఇప్పటికే విధించిన నిషేధంపై కొన్ని షరతులతో కూడిన మినహాయింపుల్ని ఇచ్చింది. నిషేధానికి ముందున్న ఉద్యోగాలకు తిరిగి వెళ్లే హెచ్ 1బీ.. ఎల్ 1బీ వీసాదారులకు అనుమతులు ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కీలక ఉత్తర్వుల్ని జారీ చేశారు.

తాజా నిర్ణయంతో ఇది వరకు పని చేసిన ఉద్యోగాల్లో పని చేయటానికి తిరిగి వస్తే వారికి అనుమతి లభించనుంది. విదేశాల్లో చిక్కుకున్న హెచ్ 1బీ వీసాదారులు అమెరికాకు ఉద్యోగాలకు తిరిగి వస్తేవీసాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఇది వీసా నిషేధానికి జరిగినదై ఉండాలన్న షరతును పెట్టారు.

ప్రాథమిక వీసాదారులతోపాటు.. జీవిత భాగస్వాములు.. వారి పిల్లలు కూడా ఇప్పుడు అమెరికాకు వచ్చే వీలుంటుంది. ఇంతకూ ఈ నిర్ణయాన్ని ట్రంప్ సర్కారు ఎందుకు తీసుకుందన్న దానిపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందులో మొదటిది.. కరోనా దెబ్బకు అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రభావితం కావటంతో.. దాన్ని చక్కదిద్దే చర్యల్లో భాగమని చెబుతున్నారు.

మరోవైపు ఎన్నికల్లో ప్రతికూలతను ఎదుర్కొంటున్న ట్రంప్.. ప్రవాసీల ఓటు బ్యాంకును భారీగా కోల్పనున్నారు. తాము వారి ప్రయోజనాలకు దెబ్బ తీసే చర్యల్ని తీసుకోమన్న సంకేతాల్ని ఇచ్చేందుకు వీలుగా తాజా నిర్ణయం ఉందంటున్నారు. మొత్తంగా.. తన తీరుకు భిన్నమైన నిర్ణయాన్ని ట్రంప్ తీసుకున్నారనే చెప్పాలి.