పవన్ని సీఎం చేస్తాను అని బాబు అంటే ....?

Sat Dec 03 2022 18:14:07 GMT+0530 (India Standard Time)

Does chandraBabu mean that Pawani will be CM

ఏపీలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందులో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ బలంగా ఉన్నాయి. అయినా కానీ ఈ రెండు పార్టీలు ఒక్క సారి కూడా అధికారంలోకి రాని కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్ కళ్యాణ్ విషయంలో కొంత కంగారు పడుతున్నాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ తానుగా గెలిచి సీఎం సీటుని అధిరోహించలేకపోవచ్చు కానీ వేరొకరి అవకాశాలను సంపూర్ణంగా గండి కొడతారు అన్నది వైసీపీ టీడీపీలకు బాగా తెలుసు.ఆ విషయంలో తెలుగుదేశానికి రెండింతల కలవరం ఉంది అంటున్నారు. ఎందుకంటే జనసేన కొల్లగొట్లే ఓట్లలో అత్యధికం టీడీపీవే కాబట్టి. అందువల్ల జనసేనను చూస్తూ చూస్తూ ఒంటరిగా పోటీకి వదిలేయలేదు. అదే సమయంలో ఆ పార్టీని పొత్తుల పేరిట కలుపుకుని వారు కోరుకున్న అధికారంలో వాటా  ఇవ్వనూ లేదు అన్నదే ఇపుడు అందరి మదిలో మెదిలే సందేహంగా ఉంది. అయితే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. ఏమైనా చివరి నిముషంలో చోటు చేసుకోవచ్చు.

ఇపుడు అలాంటిదే ఒక అద్భుతం ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకోబోతుందా అన్నదే చర్చగా ఉంది. అదేంటి అంటే పవన్ కళ్యాణ్ కి సీఎం సీటుని అప్పగించడానికి టీడీపీ ముందుకు వస్తుందా అని. పవన్ సీఎం అంటే కచ్చితంగా జనసేన టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటుంది. రెండు పార్టీలు కలిస్తే ఏపీలో మొత్తం రాజకీయం తారు మారు కావడమే కాదు వైసీపీకి ఓటమి ఏమిటో కూడా చూపించగలవు అన్న అంచనాలు ఉన్నాయి.

ఎపుడూ టీడీపీకి పక్క వాయిద్యంగా ఉండడానికి జనసేన ఇష్టపడడంలేదు. ఈసారి తమకు చాన్స్ కావాలని కోరుకుంటోంది. దానితో పాటుగా బలమైన కాపులు కూడా తమ సామాజికవర్గానికి సీఎం అన్నది ఒక కలగా మారిందని స్వాతంత్రం లభించిన ఏడున్నర పదుల ఏళ్ల తరువాత అయినా అది తీరుతుందా లేదా అని ఆలోచిస్తోంది. అందువల్ల వారి కోరిక తీర్చాలి అంటే అది తెలుగుదేశం చేతిలో ఉంది అంటున్నారు.

కాపులు ఈసారి జనసేన వైపు ర్యాలీ అయ్యేలా కనిపిస్తున్నారు. గెలుపు ఓటములు పక్కన పెడితే తమ ఓటు జనసేనకు వేయడం ద్వారా   సీఎం సీటు విషయంలో   తమ చిరకాల కోరికని నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఈ నేపధ్యంలో కాపులు అంతా ఒక వైపునకు చేరితే అది కచ్చితంగా టీడీపీకి ఇబ్బందిగా మారుతుంది. ఒక వైపు బీసీలను వైసీపీ ఆకర్షిస్తున్న వేళ కాపులను కూడా గట్టిగా ఆకట్టుకోకపోతే రెండిందాలుగా చెడుతామన్న ఆలోచనలు కూడా ఉన్నాయని అంటున్నారు.

ఈ పరిస్థితులలో జనసేనతో కలసి నడవడమే మంచిది అన్న చర్చ కూడా పార్టీలో వస్తోంది అని అంటున్నారు. జనసేనతో కలవాలీ అంటే పొత్తులు కుదరాలీ అంటే పవన్ ని సీఎం అభ్యర్ధిగా గా అంగీకరించాలి. అధికారంలో వాటా ఇవ్వాలి. ఆ విధంగా చేస్తే జనసేన వెన్ను దన్నుగా టీడీపీ వైపు నిలబడుతుంది అంటున్నారు. మరి ఈ కారణం వల్లనే అవసరం అయితే కాపు సీఎం అభ్యర్ధిని ప్రకటించడానికి టీడీపీ సిద్ధంగా ఉంది అన్న ప్రచారం వస్తోంది. ఇది ఎంతమేరకు నిజం అన్నది పక్కన పెడితే ఈ ఆలోచన కనుక కార్యరూపం దాలిస్తే  టీడీపీ   తిరుగులేని మాస్టర్ ప్లాన్ వేసినట్లే అవుతుంది అని అంటున్నారు.

పవన్ని సీఎం గా ప్రకటించడం ద్వారా టీడీపీకి బహుముఖమైన రాజకీయ లాభాలు ఉంటాయని అంటున్నారు. ఒకటి కాపులు ఎల్లకాలం టీడీపీ పట్ల కృతజ్ఞులు అయి ఉంటారు. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ కూడా చేయలేని పని టీడీపీ చేసింది అని వారు గుర్తుంచుకుంటారు. అదే టైం లో పవన్ ని సీఎం గా చేయడం ద్వారా ఆ క్రెడిట్ ని తమ ఖాతాలో శాశ్వతంగా వేసుకుని కాపులను భవిష్యత్తులో తమ వైపు తిప్పుకునే చాన్స్ ఉంటుంది. ఇక అధికార వాటలో కొంతకాలం పవన్ సీఎం గా ఉన్నా తరువాత అధికారం టీడీపీకే వస్తుంది.

అదే టైం లో ఏపీలో బలమైన సామాజికవర్గం మద్దతు టీడీపీకి మరో నాలుగు దశాబ్దాల పాటు రాజకీయంగా పటిష్టంగా ఉంచేలా చేస్తుంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే పవన్ని సీఎం చేస్తామని ఒకే ఒక్క ప్రకటన కనుక టీడీపీ నుంచి వస్తే మాత్రం వైసీపీ రాజకీయ ఆట ఏపీలో కట్టు అనే విశ్లేషణలు ఉన్నాయి. మరి బాబుకు వచ్చే ఎన్నికలు అత్యంత కీలకం కాబట్టి ఈ అద్భుతం జరిగే అవకాశాలను తోసిపుచ్చలేమని అంటున్నారు అంతా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.