Begin typing your search above and press return to search.

జగన్ మాటలను ఎవరైనా సమర్ధిస్తారా ?

By:  Tupaki Desk   |   21 Oct 2021 4:50 AM GMT
జగన్ మాటలను ఎవరైనా సమర్ధిస్తారా ?
X
టీవీల్లో వచ్చిన తిట్లు, అసభ్యపదజాలాన్ని వినలేక తమ అభిమానుల ప్రతిస్పందన రాష్ట్రమంతా కనిపించిందని జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విచిత్రంగానే ఉన్నాయి. జగన్ను టార్గెట్ చేసుకుని టీడీపీ నేత పట్టాభి నోటికొచ్చినట్లు తిట్టారు. దాంతో మండిపోయిన వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారు. దాంతో రాష్ట్రంలో రాజకీయంగా ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఇదే విషయమై వేరే సందర్భంగా జగన్ ప్రస్తావించారు.

తనను టీడీపీ నేతలు తిట్టినందుకే తమ అభిమానులు ప్రతిస్పందించారు అనే జగన్ వ్యాఖ్యలు ఏమాత్రం సమర్ధనీయంకాదు. దాడులు ఎవరు చేసినా తప్పే అని చెప్పాల్సిన జగన్ తన అభిమానుల ప్రతిస్పందన అని సమర్ధించుకోవటం బావోలేదు. దాడుల్లో పాల్గొన్నది అభిమానులైనా, మద్దతుదారులైనా తప్పు తప్పే అని జగన్ చెప్పుంటే బాగుండేది. దాడులను ఖండించటమే కాదు పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేసి యాక్షన్ తీసుకోమని ఆదేశించి ఉంటే హుందాగా ఉండేది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ను టీడీపీ నేత పట్టాభి నోటికొచ్చింది తిట్టడం తప్పే అనటంలో ఎలాంటి సందేహంలేదు. జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తిట్టినందుకు కేసు పెట్టి చట్టపరంగా యాక్షన్ తీసుకునుంటే బాగుండేది. నిజానికి పట్టాభితో జగన్ను తిట్టించటం చంద్రబాబునాయుడు వ్యూహంలో భాగమే అని అందరికీ అర్ధమవుతోంది. గంజాయి, హెరాయిన్ గురించి ప్రశ్నిస్తేనే దాడులు చేస్తారా అని చంద్రబాబు అమాయకంగా ప్రశ్నించటం విచిత్రమే. గంజాయి, హెరాయిన్ గురించి ప్రశ్నిస్తే దాడులు జరగలేదు.

జగన్ను పట్టుకుని బోసీడీకే అని తిట్టినందుకు, ఒరేయ్, అరేయ్ అని నోటికొచ్చినట్లు మాట్లాడినందుకే దాడులు జరిగాయి. తాము జగన్ను టార్గెట్ చేసి తిడితే వైసీపీ రియాక్షన్ ఇలాగే ఉంటుందని చంద్రబాబు అండ్ కో కు బాగా తెలిసి కావాలనే తిట్టించారు. అంతా వ్యూహాత్మకంగానే చంద్రబాబు నడిపించారనటంలో సందేహమే లేదు. ఎందుకంటే జగన్ను టీడీపీ నేత పట్టాభి ఏమని తిడితే వైసీపీ నేతలు దాడులు చేశారనే విషయాన్ని చంద్రబాబు మద్దతు మీడియాలో ఎక్కడా కనబడకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో వాళ్ళ ప్లాన్ ఏమిటనేది అందరికీ తెలిసిపోతోంది.

ప్రత్యర్ధులపై బురదచల్లేయటం అన్నది చంద్రబాబు అండ్ కో కు బాగా అలవాటే. గుజరాత్ లో పట్టుకున్న హెరాయిన్ కు ఏపికి ఎలాంటి సంబంధం లేదని దర్యాప్తు సంస్ధలు చెప్పినా చంద్రబాబు అండ్ కో వినటంలేదు. పట్టుబడ్డ హెరాయిన్ అంతా జగనే ఏపికి తెప్పిస్తున్నారంటు తాలాబన్లకు తాడేపల్లి ప్యాలెస్ కు సంబంధాలున్నాయంటు పదే పదే ఆరోపణలు చేశారు. సరే చంద్రబాబు అండ్ కో ఎన్ని ఆరోపణలు చేసినా, వాళ్ళ మద్దతు మీడియా ఎన్ని రాసినా జనాలైతే పట్టించుకోవటంలేదు. కాబట్టి జగన్ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. హద్దుమీరిన వాళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలే కానీ అభిమానులు దాడి చేశారని చెప్పటం ఎంతమాత్రం సమర్ధనీయంకాదు.