Begin typing your search above and press return to search.

వైసీపీకి పీకే అవసరం ఉందా ?

By:  Tupaki Desk   |   23 Sep 2021 1:30 AM GMT
వైసీపీకి పీకే అవసరం ఉందా ?
X
ఇపుడిదే ప్రశ్న అధికార వైసీపీ నేతలను తొలిచేస్తోంది. పల్లె నుండి నగరాల వరకు ఏ ఎన్నికైనా జనాల తీర్పు అధికారపార్టీకి అనుకూలంగానే ఉంటోంది. స్ధానికసంస్ధల ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీకే దిక్కులేకుండా పోతే ఇక మిగిలిన బీజేపీ+జనసేన, కాంగ్రెస్, వామపక్షాల సంగతి చెప్పాల్సిన అవసరమేలేదు. ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చాలా చోట్ల గట్టి అభ్యర్ధులే దొరకలేదన్నది వాస్తవం.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే మొన్ననే జరిగిన క్యాబినెట్ సమావేశంలో వచ్చే ఏడాది ప్రశాంత్ కిషోర్ (పీకే) బృందం వచ్చే ఏడాదే రంగంలోకి దిగబోతోందని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా టీడీపీకి మద్దతిచ్చే మీడియా బాగా ప్రచారం చేస్తోంది. ఇది నిజమో కాదో కూడా కరెక్టుగా తెలీదు. అయితే వైసీపీ నేతలు చెబుతున్న విషయం ఏమిటంటే ఇపుడు తమకు పీకే అవసరం లేదని. 2019 ఎన్నికల్లో వైసీపీకి పీకే బృందం అవసరపడింది.

క్షేత్రస్ధాయిలోని పరిస్ధితులకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు రిపోర్టులను సిద్ధం చేసి జగన్ను అలర్టు చేసింది. పీకే టీం సహకారానికి జగన్ ఇమేజి+పాదయాత్ర+చంద్రబాబునాయుడి అధ్వాన్న పాలన తోడై వైసీపీకి తిరుగులేని మెజారిటి తెచ్చిపెట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాల వల్లే స్ధానికసంస్ధల ఎన్నికల్లో పార్టీకి ఇంతటి ఘనవిజయం సాధ్యమైంది. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా చంద్రబాబు, టీడీపీ నేతలు, టీడీపీకి మద్దతిచ్చే మీడియాలోనే ఎక్కువగా కనబడుతోంది.

మిగిలిన రెండున్నరేళ్ళ కాలంలో సంక్షేమ పథకాలను ఇలాగే కంటిన్యుచేస్తు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఊపుతెస్తే వచ్చే ఎన్నికల్లో తమకు తిరుగుండదని వైసీపీ నేతలు చాలా బలంగా నమ్ముతున్నారు. కాకపోతే అక్కడక్కడ కొందరు ఎంఎల్ఏలపై నియోజకవర్గాల్లో కాస్త వ్యతిరేకత మొదలైనట్లు ప్రచారం మొదలైంది. ఈ విషయంగా జగన్ ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో ఏమైనా పీకే అవసరం ఉంటుందేమో తెలీదు.

ఈ విషయంలో ఇంటెలిజెన్స్ నుండే కాకుండా పార్టీ వర్గాల నుండి కూడా జగన్ ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. మంత్రులను, ఎంఎల్ఏలతో పాటు ఎంపిలు, నేతలను అలర్ట్ చేస్తున్నారు. ఆల్ ఈజ్ వెల్ అని జగన్ హ్యాపీగా ఏమీ ఉండటంలేదని నేతలంటున్నారు. కాకపోతే తాను చేయాల్సిన పనులను సైలెంట్ గా చేసుకుపోతున్నారు. ఈ విషయాలన్నీ మంత్రివర్గ ప్రక్షాళన తర్వాత బయపటడుతుందని నేతలు అనుకుంటున్నారు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.