మమతను దేశంలో ఎవరూ నమ్మరా?

Sat Dec 04 2021 22:01:48 GMT+0530 (IST)

Does Anyone In The Country Trust Mamata

మమత అన్న మూడు అక్షరాలపై ఇప్పుడు చర్చోపచర్చలు సాగుతున్నాయి. మోదీ ప్రభుత్వాన్ని గద్దెదింపడం తేలికేననడం యూపీఏ అనగానేమి అని ఎగతాళిగా ఎదురు ప్రశ్నలు వేస్తూ.. అది ఇప్పుడు లేదని తేలిగ్గా మాట్లాడడం ద్వారా మమత నలుగురి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఢిల్లీ పీఠంపై కూర్చోవాలని మమత ఎప్పటి నుంచే కన్నేశారని అందరూ అనుకుంటున్న మాట.బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఆమె సర్వశక్తులు ధార పోసి విజయం సాధించారని ఇక అధినేత్రి మమత హస్తినపై దండయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారని టీఎంసీ నేతలు గొప్పగా చెప్పుకుంటారు. రాజకీయాలు అన్నాక ధీమా ఉండాల్సిందే. కోరికలు కలలు ఉండడం సహజం. కానీ గాలిలో మేడలు కడితే అభాసుపాలవడం ఖాయం. నిజంగా మమతకు ఢిల్లీ పీఠాన్ని అధిష్టించే సత్తా ఉందా? పోనీ టీఎంసీ నేతలు అంటున్నట్లు వారి కల సాకరమైందే అనుకోండి కొద్దిసేపు.. ఎన్ని రోజులు అక్కడ ఆమె కూర్చుకుటుందన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. అసలే మమత కోపధారి మనిషి అని ఆమెను దగ్గర నుంచి పరిశీలిస్తున్ననేతలు అంటుంటారు. ముక్కు మీదే కోపం ఉన్న ఆమె జాతీయ స్థాయిలో చక్రం తిప్పగలరా?

ఎన్డీఏ కాంగ్రెస్ పని అయిపోందని ఇక తానే దేశానికి దిక్కని మమత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్తో ఆమె భేటీ అయ్యారు. భేటీ తర్వాత రాహుల్ గాంధీపై ఆమె పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అయితే మమత నోటి నుంచి ఈ మాటలు రాలేదని.. ఆ వ్యాఖ్యల వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారనే ప్రచారం ఉంది. ఇదే విధంగా బెంగాల్ ఎన్నికల్లో కూడా రాహుల్ను ఉద్దేశించి పీకే ఇంచుమించుగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాహుల్ కు రాజకీయం అర్థంకావడం లేదని అన్నారు.

మమత పీకే కూడబలుక్కుని రాహుల్ ను టార్గెట్ చేయడం వెనుక మర్మం దాగి ఉందనే విశ్లేషణలు వచ్చాయి. రాహుల్ నాయకత్వంలో మోదీని గద్దెదింపడం జరగనిపని కనుక ప్రాంతీయపార్టీలన్నీ తనచుట్టూ చేరాలన్నది మమత ఉద్దేశమని అందవల్లే ఆమె ఇలాంటి సంకేతాలు పంపుతున్నారని అంటున్నారు.

ఎన్నికలకు ముందు హడావుడి చేయడం మమతకు కొత్తేమీకాదని కొందరు అంటున్నారు. బెంగాల్ లో ఐదేళ్ల క్రితం మూడుస్థానాలున్న బీజేపీ ఇప్పుడు డెబ్బై స్థానాలకు పుంజుకుంది. ఆ పార్టీ వల్ల ఇప్పటికిప్పుడు మమతకు ప్రమాదమేమీ లేదు. ఆమె బీజేపీపై సునాయాసంగా గెలువడానికి అక్కడ వామపక్షం బలహీనంగా ఉండడం ఓ కారణం. అయితే చాలా రాష్ట్రాల్లో ఇదేరకమైన రాజకీయ పరిస్థితులు లేవు. కేవలం బీజేపీపై వ్యతిరేకత మోదీ మీద ఘాటైన విమర్శలు చేయడం వల్ల ప్రాంతీయ పార్టీలు ఆమె ఒడిలోకి రావు. ఇలా ఢిల్లీ వెళ్లి అలా మోదీని దించేయబోతున్నట్టుగా మమత మాటలు ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు.

అసలు ఇది సాధ్యమేనా అనే ప్రశ్నలు కూడా వేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఓడించాలనుకోవడం పగటికలేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలు కొట్టిపారేయలేనివి. కనీసం పదిరాష్ట్రాల్లో ఇప్పటికీ కాంగ్రెస్ ఓట్ల వాటా ముప్పైశాతం వరకూ ఉంది. దేశస్థాయిలో దానిని తృణమూల్ తో పోల్చడం కూడా సరికాదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మమత తనను తాను జాతీయస్థాయి నాయకురాలిగా చెప్పుకునేందుకు ఆయా రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ వ్యూహాలు ఎంతోకొంత ఉపకరిస్తాయే తప్ప.. ఆమెను ఢిల్లీ పీఠం మీద కూర్చోబెట్టలేవని చెబుతున్నారు.

ప్రధానంగా రాహుల్ మీద కక్షతోనే కాంగ్రెస్ను ఘోరంగా దెబ్బతీయడం ఆరంభించారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ లో చేరేందుకు పీకే ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు బెడిచికొట్టాయి. ఆ తర్వాత కాంగ్రెస్ వర్సెస్ పీకే అన్నట్లుగా సాగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన బీజేపీకి ఉపకరించే విధంగా మమతను ప్రొత్సహిస్తారనే ఆరోపణలు వస్తున్నాయి. మమత పీకే ఇద్దరూ కలిసి కాంగ్రెస్ కు వ్యతరేకంగా కూటమిని ఏర్పాటు చేసి అంతిమంగా బీజేపీకి లాభం చేకూర్చాలనే ఎత్తుగడ వేస్తున్నారనే విమర్శలు ఊపందుకున్నాయి. ఎవరైనా ఢిల్లీ పీఠంలో కూర్చోవాలంటే ఈశాన్య ఉత్తరాదిన బలం ఉంటే సరిపోదు.

దక్షిణాది మద్దతు లేకుండా కేంద్రంలో నిలదొక్కుకోవడం కష్టం. గతంతో జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో వాజ్ పేయి పీఠం దిగాల్సి వచ్చింది. ఇక గతంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో చంద్రబాబు కీలక భూమిక పోషించారు. ఈ కారాణాలన్నీ పరిశీలిస్తే దక్షిణాది మద్దుతు లేకుండా కేంద్రంలో మనలేరనేది ఖాయం.

అయితే మమత అంటే దక్షిణాదిన ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. దక్షిణాదిలో ప్రాంతీయపార్టీలదే హవా. ఇలాంటి చోట మమతకు మద్దతు ఎవరిస్తారనేది అనుమానమే. గతంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో పెద్ద హడావిడి చేశారు. ఇప్పుడు కూడా కేంద్రంపై ఆయన యుద్ధాన్ని ప్రకటించారు. ఒకవేళ ఆ ప్రాంతంలో కేసీఆర్ కు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయనే తప్ప.. మమతకు మద్దతు ఇచ్చే అవకాశం ఎంత మాత్రమూ లేదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ను కాదని మమతతో జోడీ కట్టే ప్రసక్తే లేదని చెబుతున్నారు. దక్షిణాదినే కాదు ఉత్తరాదిలోనూ ఆమెతో కలిసేందుకు ఏ పార్టీ కూడా అంతగా ఆసక్తి చూపించకపోవచ్చని చెబుతున్నారు.