Begin typing your search above and press return to search.

ఇంతకు మించిన ఉపద్రవం ఏదో రాబోతుందన్న డాక్టర్ పెద్దాయన

By:  Tupaki Desk   |   1 April 2020 12:30 AM GMT
ఇంతకు మించిన ఉపద్రవం ఏదో రాబోతుందన్న డాక్టర్ పెద్దాయన
X
విడి రోజుల్లో ఇలాంటివేమీ పెద్ద ఆసక్తికర అంశాలు కానే కావు. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. కరోనా పుణ్యమా అని ప్రపంచం మొత్తం హడలెత్తిపోతున్న వేళ.. వైరస్ లు.. బ్యాక్టీరియాకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతోంది. శాస్త్రసాంకేతికతల విషయంలో మనిషి తోపుగా ఫీలయ్యే వారందరికి కంటికి కనిపించని కరోనా చేస్తున్న సామాజిక విధ్వంసాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నటి వరకూ మనిషి మహా బలవంతుడిగా భావించిన వారంతా పునరాలోచనలో పడుతున్నారు.

కంటికి కనిపించనంత సూక్ష్మాతిసూక్ష్మమైన ఒక వైరస్ ఎందుకింత రచ్చ చేస్తోంది? దీనికి కారణం ఏమిటి? అన్న విషయాల్ని తెలుగు ప్రజలకు సుపరిచితులైన డాక్టర్ సోమరాజు చెప్పుకొచ్చారు. కరోనా వేళ.. ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారటమే కాదు.. వైరస్ ల గురించి తెలుసుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయన్న భావన కలుగక మానదు.

బలహీనులు ప్రపంచాన్ని పాలిస్తారన్న నానుడి ఉంది. దీనికి తగ్గట్లే ప్రపంచంలోనే అత్యంత బలమైన డైనోసార్స్ వంటి జీవరాశిని నాశనం చేసిన మనుషులే.. నిజానికి బలహీనమైన ప్రాణులు. ప్రపంచాన్ని పాలిస్తున్నట్లుగా అనుకుంటాం. మనిషి బలమైనోడని అనుకుంటాం. కానీ.. మన బలం ఏదీ సూక్ష్మజీవుల ముందు నిలువలేకపోతోంది. అవి వేగంగా తమ మూలాల్ని మార్చుకుంటున్నాయి.

ఒక బ్యాక్టీరియాను గుర్తించి.. దాన్ని కష్టపడి మందు కనిపెడితే.. కొన్ని గంటల్లోనే.. అది మందులకు లొంగని రీతిలో తన రూపాన్ని మార్చుకుంటోంది. ఇలా మనిషి కొత్త మందులు కనిపెడుతున్న ప్రతి సందర్భంలోనూ అవి ఇంకో రూపంలో విరుచుకుపడుతున్నాయి. ఇప్పుడవి మనల్ని శాసిస్తున్నాయి. ప్రస్తుతం ముప్పు వాకిట నిలుచున్నాం. ఇది ఆరంభం మాత్రమే.. వీటి కంటే మరేదో ఉపద్రవం మున్ముంది రాబోతుందేమోనన్న ఆందోళన నాలో ఉంది.. దాన్ని అధిగమించటం అంత తేలికైనది కాదని అనిపిస్తోందని చెప్పుకొచ్చారు. డాక్టర్ పెద్దాయన నోటి నుంచి వస్తున్న మాటల్ని విన్నప్పుడు.. రానున్న రోజులు అంత బాగుండే అవకాశం లేదనిపించకమానదు.