Begin typing your search above and press return to search.

ఆఖరుకు పానీ పూరీలు అమ్ముకునే దుస్థితికి డాక్టర్లు..

By:  Tupaki Desk   |   27 March 2023 3:35 PM GMT
ఆఖరుకు పానీ పూరీలు అమ్ముకునే దుస్థితికి డాక్టర్లు..
X
రాజస్థాన్ లో వైద్యులు ఆందోళన బాటపట్టారు. ఓ లేడీ డాక్టర్ వైద్యం బంద్ చేసి ఆస్పత్రికితాళం వేసి రోడ్డుపై పానీపూరి పెట్టుకొని అమ్ముకునే దుస్థితికి దిగజారింది. రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన ఓ మహిళా వైద్యురాలు ఆస్పత్రికి తాళం వేసి ఈ పనిచేసింది. ఆ బండిపై ప్రైవేట్ డాక్టర్ అని కూడా రాసి ఉంచడం గమనార్హం.

అంతేకాదు ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది సైతం పానీపూరీ బండి పక్కనే టీ దుకాణం పెట్టుకుని టీ విక్రయిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇలాంటి సంఘటనలు సికార్ జిల్లాలోనే కాదు, రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది రోడ్లపై పానీపూరీ, టీలు విక్రయిస్తున్నారు. ఇవి బతుకుదెరువు కోసం, డబ్బు సంపాదించడం కోసం చేసే పనులు కాదు. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లుకు వ్యతిరేకంగా వైద్యులు ఇలా చేస్తున్నారు.

ప్రభుత్వం ఇచ్చిన షాక్ తో ప్రైవేట్ ఆస్పత్రులకు తాళాలు వేసి.. సిబ్బందితో పాటు ఆస్పత్రి వైద్యులు రోడ్లపైకి వచ్చి వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

రాజస్థాన్‌లోని సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఇటీవల కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు ప్రకారం, ప్రతి పౌరుడు అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండా ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స పొందవచ్చు. ఈ చట్టంపై ప్రైవేట్‌ ఆసుపత్రుల వైద్యులు ఆందోళనకు దిగారు. వారి నిరసనల మధ్య రాజస్థాన్ ప్రభుత్వం 'ఆరోగ్య హక్కు బిల్లు'ను ఆమోదించింది.

ఈ బిల్లుతో ప్రైవేట్ ఆసుపత్రుల వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని ప్రైవేట్ వైద్యులు ఆందోళనకు దిగారు.

ఈ నెల 29న వైద్యులు, వైద్య సిబ్బంది పెద్దఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వైద్యుల ఆందోళనపై సీఎం గెహ్లాట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదివారం వైద్యులంతా విధులకు రావాలని మీడియా ద్వారా ప్రభుత్వం కోరింది. అయితే వైద్యుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ క్రమంలో వైద్యుల నిరసనలను అణిచివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.