Begin typing your search above and press return to search.

ఐసీయూలోని కరోనా రోగులు....డాక్టర్ సంచలన విషయాలు

By:  Tupaki Desk   |   3 Aug 2020 2:00 PM GMT
ఐసీయూలోని కరోనా రోగులు....డాక్టర్ సంచలన విషయాలు
X
కరోనా మహమ్మారి విలయ తాండవం కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలోని పలు దేశాలను ఈ ప్రాణాంతక వైరస్ పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది అహర్నిశలు పాటుపడుతున్నారు. శ్వాస కోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోన్న కరోనా వల్ల కొందరికి తప్పనిసరిగా వెంటిలేషన్ చికిత్స అవసరం అవుతోంది. ఐసీయూలో వెంటిలేటర్ పై తీవ్ర లక్షణాలున్న రోగులకు చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు వైద్యులు. ఇలా కరోనా తీవ్ర లక్షణాలతో ఐసీయూలో చేరిన రోగుల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు, లక్షణాలు ఉంటాయి....ఐసీయూలో చేరిన రోగుల మానసిక పరిస్థితి, వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటాయన్న విషయాలను పల్మనరీ మెడిసిన్, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మైక్ హాన్సెన్ వెల్లడించారు. గత కొన్ని నెలలుగా ఐసియులో కరోనా రోగులకు చికిత్స అందించిన హాన్సెన్ కరోనా రోగుల్లో గమనించిన కీలకమైన 10 విషయాలను చెప్పారు.

కరోనా రోగుల్లో సాధారణ లక్షణాలైన జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోలేకపోవడం, కండరాల నొప్పులు. రుచి, వాసన కోల్పోవడం, వికారం, విరేచనాలు వంటివి ఐసీయూలో ఉన్న కరోనా రోగుల్లో కనిపించడం లేదని హాన్సెన్ చెప్పారు. చాలా మంది రోగులలో తక్కువ విటమిన్ డీ స్థాయిలు ఉన్నాయని ఆయన చెప్పారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఐసియులో పనిచేసే మిగతా వారికీ కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఐసియులో చికిత్స పొందుతున్న వారిని చూసేందుకు ఎవరిని లోపలికి అనుమతించరు. దీంతో, తమ వారు కనిపించక వారు ఒంటరి అవుతారు. ఇది రోగితో పాటు, కుటుంబ సభ్యులకూ ఇబ్బందికర పరిస్థితి. ఐసీయూలోని కొందరు పేషెంట్లు ఒంటరిగానే చనిపోతున్నారని చెప్పారు. కరోనాకు వేరే వ్యాధికి పనిచేసే మందుల ద్వారానే చికిత్స చేస్తున్నామని అన్నారు.

కరోనా సమయంలో టెస్టుల ఫలితాలను ఊహించడం కష్టమని హాన్సెన్ వివరించారు. ఆర్ టీ పీసీఆర్ టెస్టు వేరు చేసిన వైరల్ ఆర్ ఎన్ ఏను ఎంచుకుంటుందని, ఈ అవశేషాలు పరీక్షలో పాజిటివ్ రావడానికి కారణం అవుతున్నాయని వెల్లడించారు. కరోనా రోగుల్లో ఊబకాయం లేదా అధిక బరువు కలిగిన వారు అధికంగా ఉన్నారని, అందుకే కరోనా రోగుల్లో చాలామంది కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకోలేరని తెలిపారు.
రోగి ఇంట్యూబేట్ అయిన తర్వాత, వెంటిలేటర్‌లోని సెట్టింగులు ఆ రోగికి అనుగుణంగా ఉండాలని, కొందరు రోగులకు శ్వాసకోశంలో ఎక్కువ మంట లేదా ఎక్కువ రక్తం గడ్డకట్టవచ్చని అన్నారు. కొంతమంది రోగుల్లో ఊపిరితిత్తుల పనితీరుకు కరోనా వల్ల శాశ్వత నష్టం ఉందన్నారు.

చాలామందిలో కాలక్రమేణా ఆ సమస్య నెమ్మదిగా నయం అవుతుందన్నారు. కరోనా వైరస్ ఎవరికి సోకుతుందో ....ఎవరిలో లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పలేమని హాన్సెస్ అన్నారు. కొందరికి అకస్మాత్తుగా వెంటిలేషన్ అవసరం ఉంటుందని....కొంతమంది ఇతరులకన్నా వేగంగా కోలుకుంటారని వెల్లడించారు. మన శరీరంలోని యాంటీబాడీస్ కరోనాను అడ్డుకొని ఎంతకాలం రక్షణగా ఉంటాయో తెలియదని, వ్యాక్సిన్ మాత్రమే వైరస్ నుంచి దీర్ఘకాలం రక్షించలేదని అన్నారు. మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం వంటివి తప్పనిసరిగా చేయాలని హాన్సెన్ సూచించారు.