Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ తో కోమ‌టిరెడ్డి రాజీ ప‌డ్డ‌ట్టేనా..?!

By:  Tupaki Desk   |   24 Feb 2020 3:30 PM GMT
కాంగ్రెస్ తో కోమ‌టిరెడ్డి రాజీ ప‌డ్డ‌ట్టేనా..?!
X
కాంగ్రెస్ పార్టీని వీడి భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి చేరే వార్త‌ల్లో నిలిచిన నేత కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి. తెలంగాణ‌లో చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సీనియ‌ర్ నేత‌లు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు చ‌క్రం తిప్పిన వాళ్లు, తెలంగాణను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలంటూ అధిష్టానం పై ఒత్తిడి తెచ్చిన వాళ్లు.. వీళ్లంతా ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నారు. వీళ్లే తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే కేసీఆర్ తో మాట్లాడి కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ ను విలీనం చేయిస్తామంటూ ప్ర‌క‌ట‌న‌లు చేశారు అప్ప‌ట్లో. తీరా వీరే టీఆర్ఎస్ లోకి విలీనం అయిపోయారు!

అయితే వారంద‌రికీ భిన్నంగా కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మాత్రం బీజేపీ వైపు చూశారు. భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి చేర‌డ‌మే త‌రువాయి అనేంత స్థాయిలో హ‌డావుడి చేశారు రాజ‌గోపాల్ రెడ్డి. సొంత పార్టీని, సొంత పార్టీ నేత‌ల‌ను విమ‌ర్శించారు. అలా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ లోకి చేర‌తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. బీజేపీ అనుకూల ప్ర‌క‌ట‌న‌లు కూడా చేశారు ఈ ఎమ్మెల్యే. తెలంగాణ‌లో బీజేపీ పుంజుకుంటుంద‌ని, తెలంగాణ రాష్ట్ర స‌మితికి బీజేపీ ప్ర‌త్యామ్నాయం అవుతుందంటూ ప్ర‌క‌ట‌న‌లు చేశారు!

అలా క్ర‌మ‌క్ర‌మంగా కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ కూ దూరం అయ్యారు. బీజేపీ అనుకూల ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ఒక ద‌శ‌లో బీజేపీలోకి చేరితే త‌నే ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి అంటూ త‌న అనుచ‌రుల వ‌ద్ద ప్ర‌క‌టించుకున్నారు ఆయ‌న‌. బీజేపీ వాళ్లు అప్ప‌టి నుంచి ఆయ‌న‌ను లైట్ తీసుకున్న‌ట్టుగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ తో మాత్రం కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి గ్యాప్ కొన‌సాగింది. ఆయ‌న సోద‌రుడు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ త‌ర‌ఫునే ఉంటూ వ‌చ్చారు. అడ‌పా ద‌డ‌పా పార్టీని విమ‌ర్శించినా ఆయ‌న కాంగ్రెస్ త‌ర‌ఫునే కొన‌సాగుతూ ఉన్నారు. బీజేపీ ఊసు ఎత్త‌డం లేదు.

ఇప్పుడు ఆస‌క్తి దాయ‌క‌మైన అంశం ఏమిటంటే.. రాజ‌గోపాల్ రెడ్డి మ‌ళ్లీ కాంగ్రెస్
కు ద‌గ్గ‌ర అవుతుండ‌టం. తాజాగా ఆయ‌న సీఎల్పీ మీటింగ్ కు కూడా హాజ‌రు కావ‌డం గ‌మ‌నార్హం. కొంత గ్యాప్ త‌ర్వాత ఆయ‌న ఇలా కాంగ్రెస్ లెజిస్లేటర్ల‌ మీటింగ్ కు హాజ‌రై త‌ను ఆ పార్టీతోనే ఉన్న‌ట్టుగా అనిపిస్తున్నారు. మ‌రి బీజేపీ ప్లాన్లు మానేసుకుని కోమ‌టి రెడ్డి కాంగ్రెస్ కు క‌ట్టుబ‌డుతున్న‌ట్టే అనే అభిప్రాయాలు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి.