కేటీఆర్ కు కరోనా వస్తే ఏం చేస్తారో తెలుసా?

Tue Aug 04 2020 13:40:28 GMT+0530 (IST)

Do you know what to do if KTR gets corona?

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ నోటి నుంచి వచ్చిన ఒక మాట ఆసక్తికరంగా మారింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మాయదారి తమకు సోకాలని ఏ రంగానికి చెందిన ప్రముఖుడి నోటి నుంచి మాట రాదు. ఒకవేళ.. అలాంటి పరిస్థితే ఉన్నా.. దాని గురించి ముందుస్తుగా మాట్లాడటానికి ఇష్టపడరు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. కరోనా గురించి మాట్లాడటం మానేసినట్లు చెబుతారు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. సీఎం కేసీఆర్ కుమారుడు తాజాగా కరోనాకు సంబంధించిన కీలకమైన ప్రకటన చేయటం గమనార్హం.తనకు కరోనా వస్తే.. ఏం చేయాలనుకుంటున్నది చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు మంత్రి కేటీఆర్. ఒకవేళ తనకు కరోనా వస్తే.. కోలుకున్న తర్వాత ప్లాస్మా ఇవ్వటానికి ముందుకు వస్తానని చెప్పారు. ఇటీవల కాలంలో ఇంత ఓపెన్ గా కరోనా వస్తే.. ఫ్లాస్మా దానానికి తాను సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పటం ఇప్పటికి ఎవరికి సాధ్యం కాలేదని చెప్పక తప్పదు.

కరోనాతో సహజీవనం తప్పనిసరి అని.. దాన్ని ఎదిరించి పోరాటమే తప్పించి.. భయం ఏ మాత్రం మంచిది కాదన్నారు. తమ కారణంగా వేరే వారికి కరోనా వ్యాపించకూడదన్న ఉద్దేశంతో హైదరాబాద్ కు చెందిన ఒక పెద్ద వయస్కుల జంట ఒకరు ఆత్మహత్య చేసుకోవటం తనను కలిచివేసిందని చెప్పారు. మిగిలిన దేశాలతో పోలిస్తే.. మనం మరణాల విషయంలో మెరుగైన స్థితిలో ఉన్నామని కేటీఆర్ చెప్పారు. ఏమైనా.. కరోనా వస్తే ఏం చేయాలి? నయమయ్యాక మరేం చేయాలన్న దానిపై మంత్రిగారికి ఉన్న క్లారిటీకి ముచ్చట పడాల్సిందే.