ఈ మొక్కలు ఎంత డేంజరో తెలుసా..?

Wed Jul 06 2022 12:11:13 GMT+0530 (IST)

Do you know how dangerous these plants are?

రాష్ట్రమంతా పచ్చని తోరణం కట్టాలని కేసీఆర్ దీక్ష పూనారు. దీనికోసం పట్టణాలు పల్లెల్లో విరివిగా మొక్కలు పెంచుతున్నారు. పచ్చదనం సుందరీకరణ కోసం ఎక్కువగా కోనో కార్పస్ మొక్కలు పెంచుతున్నారు. అయితే ఇప్పుడు ఆ మొక్కల పై నిషేధం విధించినట్లు సమాచారం. ఎందుకంటే దీనివల్ల పర్యావరణానికి పలు రకాలుగా విఘాతం కలుగుతోందట.కోనోకార్పస్.. ఈ మొక్క పెంచడానికి ఓ కొమ్మ నాటితే చాలు. అటు అందంగా.. ఇటు ఆకర్షణీయంగా.. ఏపుగా పెరుగుతుంది. పచ్చదనాన్ని.. పరిసరాలకు అందాన్ని తీసుకువస్తుంది. తక్కువ కాలంలోనే ఈ మొక్క దేశమంతా విస్తరించింది. కానీ దీనివల్ల పర్యావరణానికి పలు విధాలుగా విఘాతం కలుగుతోందట.

ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజల్లో శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయని మున్సిపాలిటీలకు రూ.లక్షల్లో నష్టం కలుగుజేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ లోని దాదాపు అన్ని పట్టణాల్లో రోడ్ల మధ్య సుందరీకరణ కోసం ఈ మొక్క ను పెంచుతున్నారు. నిటారుగా ఏపుగా పెరిగి నిత్యం పచ్చదనంతో కళకళలాడే ఈ మొక్క తన దుష్ప్రభావాలతో ఇప్పుడు వార్తల్లోకెక్కింది.  

దుబాయ్ అమెరికా ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ మొక్కను.. కొన్నేళ్ల క్రితం దేశంలోని వేర్వేరు పురపాలక సంస్థలు దిగుమతి చేసుకున్నాయి. కొమ్మను తుంచి మట్టిలో నాటితో చాలు.. ఈ మొక్క బతికేస్తుంది. అలా తక్కువ సమయంలో కోనోకార్పస్ జాతి మొక్క.. దేశం మొత్తం విస్తరించింది. సరిగ్గా అదే సమయానికి విదేశాల్లో దీనిపై ఆందోళన మొదలైంది.

"కోనోకార్పస్ మొక్క పుష్పాల నుంచి వెలువడే పుప్పొడి వల్ల అలర్జీ శ్వాసకోశ ఆస్తమా సమస్యలు వస్తున్నా­యని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. వీటి వేర్లు లోతుకంటూ పాతుకుపోతూ.. మధ్యలో అడ్డు వచ్చే కమ్యూ­నికేషన్ కేబుళ్లు డ్రైనేజీ లైన్లు మంచినీటి వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయని గుర్తించారు. దీనిపై పరిశోధనలు జరిపిన పాకిస్తాన్ ఇరాన్ వంటి దేశాలు ఈ మొక్కను నిషేధించాలని నిర్ణయించాయి. ఈ మొక్కతో కీటకాలకు పక్షులకు ఎలాంటి ఉపయోగం లేదు. వీటిపై పక్షులు గూళ్లు కట్టవు" అని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

దీని దుష్పరిణామాలను గుర్తించిన ప్రభుత్వం.. వీటిని హరితహారంలో నాటొద్దని నర్సరీల్లో పెంచొద్దని అన్ని జిల్లాల డీఆర్‌డీవో విభాగాలను ఆదేశించింది. క్షేత్రస్థాయిలో ఈ ఆదేశాలు సరిగా అమలు కావట్లేదు. వెంటనే ఈ మొక్కల్ని నిషేధించాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.