Begin typing your search above and press return to search.

దేశంలోనే అత్యంత సంపన్న మహిళ గురించి తెలుసా?

By:  Tupaki Desk   |   20 Jun 2021 8:19 AM GMT
దేశంలోనే అత్యంత సంపన్న మహిళ గురించి తెలుసా?
X
టెక్నాలజీ కంపెనీ ‘హెచ్.సీ.ఎల్’. అంటే తెలియని వారు ఉండరు. ఆ కంపెనీని నిలబెట్టింది శివ్ నాడార్. ఆయన తర్వాత కంపెనీ బాధ్యతలు చేపట్టింది ఆయన ఏకైక కూతురు రోషిణి నాడార్ మల్హోత్రా. ఈ పదవితో ఆమె భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళగా ఆవిర్భవించింది.

హెచ్.సీ.ఎల్ కంపెనీ సీఈవోగా.. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా.. విద్యాజ్ఞాన్ చైర్ పర్సన్ గా రోషిణీ నాడార్ ఇప్పుడు దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా ఎదిగారు. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో సమర్థమైన నాయకత్వ లక్షణాలు కనబరిచిన 25మంది పారిశ్రామికవేత్తలలో రోషిణి పేరు కూడా ఉంది. 38 సంవత్సరాల రోషిణీ ప్రస్తుతం హెచ్.సీ.ఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ అయ్యారు. అంతకుముందు భారతీయ ఐటీ కంపెనీని నడిపించిన మొట్టమొదటి మహిళగా మరో విజయం సాధించి గుర్తింపు పొందారు.

దేశంలోనే సాంకేతిక దిగ్గజం, హెచ్.సీ.ఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ కు ఏకైక సంతానంగా ఢిల్లీలో 1982లో రోషిణి జన్మించారు. వసంత్ వ్యాలీ పాఠశాలలో చదువుకున్నారు. నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి కమ్యూనికేషన్స్ లో బ్యాచ్ లర్స్ డిగ్రీ, కెలాగ్స్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ చేశారు. చదువు పూర్తి అయ్యాక బ్రిటన్ లో న్యూస్ ప్రొడ్యూూసర్ గా కెరీర్ ప్రారంభించారు. 27 ఏళ్ల వయసులో తండ్రి ప్రారంభించిన హెచ్.సీ.ఎల్ వ్యాపారంలో భాగస్వాములయ్యారు. హెచ్.సీ.ఎల్ లో చేరిన సంవత్సరానికే ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మాత్రమే కాకుండా కంపెనీ సీఈవో బాధ్యతలు చేపట్టారు.

అయితే రోషిణికి ముందు నుంచి ఈ టెక్నాలజీ రంగంపై ఆసక్తి లేదట.. వార్తలు, జర్నలిజంపై ఆసక్తి ఉండేది. కానీ తండ్రి అప్పగించిన ఈ బాధ్యతను ఆమె సమర్థంగా నిర్వహిస్తూ తన రంగాన్ని అభిరుచిని మార్చుకొని ముందుకెళుతున్నారు. రోషిణి చూపిన శ్రద్ధ, అంకితభావం కారణంగా ఆ కంపెనీ ఆర్థికంగా,పరిపాలన పరంగా బాగా ఎదిగింది.

హోండా కంపెనీలో పనిచేస్తున్న శిఖర్ మల్హోత్రాను 2009లో ఆమె పెళ్లి చేసుకున్నారు. వివాహ అనంతరం హెచ్.సీ.ఎల్ లో చేరి ప్రస్తుతం ఆమె భర్త కూడా ‘హెల్త్ కేర్ ’ విభాగంలో వైస్ చైర్ పర్సన్ గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం.. అర్మాన్, జహాన్. ఇప్పటికే చాలా అవార్డులను రోషిణి అందుకున్నారు.