'సుప్రీం' ఎఫెక్ట్...నష్టాల్లో బాణాసంచా వ్యాపారులు!

Wed Nov 07 2018 19:19:49 GMT+0530 (IST)

Diwali cracker sale affected after Supreme Court verdict

దీపావళి నాడు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని ఈ నెల 23న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. భారీ శబ్దాలు చేసే టపాసుల అమ్మకాలు ఆన్‌లైన్ అమ్మకాలపై నిషేధం పర్యావరణహిత (ప్రకృతికి పెద్దగా నష్టం కలిగించని) టపాసులను కాల్చుకోండని సూచించడం తెలిసిందే. ఆ ఆదేశాలపై చాలామంది ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ నిబంధనలను ఉల్లంఘించి టపాసులు కాల్చిన వారి పై కేసులు కూడా నమోదవుతున్నాయి. మరోవైపు సుప్రీం ఆదేశాల ప్రభావం ఈ ఏడాది టపాసుల అమ్మకాలపై పడింది. గత ఏడాదితో పోలిస్తే 40 శాతం తక్కువ అమ్మకాలు జరిగాయని తెలుస్తోంది. దీంతో ఢిల్లీలో బాణాసంచా వ్యాపారులు కొందరు నష్టాలపాలయ్యమని కాకరకాయలు...బెండకాయలు ప్రదర్శిస్తూ వినూత్న నిరసన తెలిపారు.
 
గత ఏడాది 20 వేల కోట్ల బాణాసంచా అమ్మకాలు జరిగాయి. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఈ ఏడాది అమ్మకాలు 40 శాతం పడిపోయాయని వ్యాపారులు వాపోతున్నారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని...సుప్రీం ఆదేశాలు జారీ చేయడం మంచిదేనని కానీ దాని వల్ల వ్యాపారం ఒక్కసారిగా కుదేలయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా దీపావళి సీజన్ లో లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని కానీ ఈ సారి మాత్రం అమ్మకాలు లేకపోవడం....సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఉత్పత్తి కూడా తగ్గడం శోచనీయమన్నారు. గ్రీన్ క్రాకర్స్ పై కేంద్రం మార్గదర్శకాలకు ముందే క్రాకర్స్ తయారు చేశామని వచ్చే ఏడాది గ్రీన్ క్రాకర్స్ పూర్తిగా చేసే అవకాశముందన్నారు. అయితే పండుగలతోపాటు రాజకీయ నాయకుల విజయోత్సవాలు....ర్యాలీల సందర్భంగా కూడా...టపాసులు కాల్చడంపై నిషేధం ఉండాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.