Begin typing your search above and press return to search.

'దిశ' ఎన్ కౌంటర్ విచారణ.. పోలీసులకు చుక్కలు కనిపిస్తున్నాయట

By:  Tupaki Desk   |   26 Sep 2021 4:36 AM GMT
దిశ ఎన్ కౌంటర్ విచారణ.. పోలీసులకు చుక్కలు కనిపిస్తున్నాయట
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన 'దిశ' ఎన్ కౌంటర్ కు సంబంధించి ప్రభుత్వం జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ ను ఏర్పాటు చేయటం తెలిసిందే. దారుణ రీతిలో హత్యాచారం చేసిన ఈ ఉదంతానికి సంబంధించి జరిగిన ఎన్ కౌంటర్ పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలు చోటు చేసుకున్నాయి. వారి ఎన్ కౌంటర్ జరిగిన రోజున ప్రజలు పండుగ చేసుకున్నారు. ప్రజాభిప్రాయం ఇలా ఉంటే..చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎన్ కౌంటర్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ హక్కుల నేతలు పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వేళ.. ఈ ఉదంతంపై ఒక విచారణ కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఇప్పటికే కమిషన్ ఎదుట పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. తాజాగా ప్రస్తుత వనపర్తి ఎస్పీ అపూర్వారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పలు ప్రశ్నల్ని ఎదుర్కొన్నారు. దిశ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులు వినియోగించిన తూటాల లెక్క తేల్చేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఆయుధాల రిజిస్టర్ ను తనిఖీ చేశారా? అంటూ ఆమెను ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన ఎస్పీ అపూర్వారావు.. తనిఖీ చేయలేదన్నారు.

ఆమెనే ఎందుకంటే.. చటాన్ పల్లి ఎన్ కౌంటర్ ఘటనపై ఏర్పాటైన సిట్కు సంబంధించిన కేస్ డైరీని ఆమెనే రాశారు. ఈ నేపథ్యంలో ఆమె కమిషన్ విచారణను ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నల్ని ఆమె ఎదుర్కొన్నారు. ఎన్ కౌంటర్ లో గాయపడినట్లుగా చెబుతున్న పోలీసులకు చికిత్స చేసిన ఆసుపత్రిని సందర్శించిన సమయంలో గాయపడిన వారు ఐసీయూలో ఉన్నారా?సాధారణ వార్డులో ఉన్నారా? అని ప్రశ్నించారు.

సాధారణ వార్డులో ఉన్నట్లుగా ఎస్పీ పేర్కొనగా.. తీవ్ర గాయాలతో ఉన్నారని సిట్ నివేదికలో ఉందని.. అలాంటి వారిని సాధారణ వార్డులో ఎలా ఉంచారంటూ కమిషన్ సభ్యులు ప్రశ్నించారు. ఐసీయూకు.. ఐసీసీయూకు.. సాధారణ వార్డులకు తేడా తెలుసా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. అపూర్వారావు విచారణ పూర్తి చేశాక.. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డిని కమిషన్ ప్రశ్నించింది. 'దిశ' అత్యాచారానికి గురైందని మీరెలా నిర్దారణకు వచ్చారని ప్రశ్నించగా.. ఘటనాస్థలంలో దిశ చున్నీ.. లాకెట్.. దుస్తులు పడి ఉండటంతో పాటు నిందితులంతా పురుషులే కావటంతో అత్యాచారం జరిగిందని ఊహించినట్లు చెప్పారు.

ఆ వస్తువులు దొరికినంత మాత్రాన అత్యాచారం జరిగినట్లు ఎలా భావిస్తారని కమిషన్ ప్రశ్నించగా.. మౌనంగా ఉండిపోయినట్లు తెలిసింది. ఎన్ కౌంట్ జరిగిన తర్వాత మెజిస్ట్రేట్ వచ్చే వరకు ఘటనాస్థలం నుంచి డెడ్ బాడీని తరలించొద్దనే విషయం తెలీదా? అని ప్రశ్నించగా.. అలా చేయటం సరికాదని అంగీకరించటంగమనార్హం. కమిషన్ ముందు విచారణకు అప్పటి సైబరాబాద్ కమిషనరేట్ కు సీపీగా వ్యవహరించిన సజ్జన్నార్ బుధవారం హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటారు? దానికి ఆయన ఎలాంటి సమాధానాలు ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.