తెలంగాణ వాసులకి హెచ్చరిక ...మొదలైన సెకండ్ వేవ్ !

Wed May 27 2020 16:20:42 GMT+0530 (IST)

Warning For Telangana people  ... Second wave started !

తెలంగాణలో గత వారం రోజులుగా వైరస్ కేసులు పెరుగుతూవస్తున్నాయి. గత 15 -20 రోజులుగా జీహెచ్ ఏం సీ కే పరిమితమైన వైరస్ మళ్లీ జిల్లాల్లో పంజా విసురుతోంది. మంగళవారం 71 కేసులు నమోదు కాగా.. జీహెచ్ఎంసీలో 38 రంగారెడ్డి జిల్లాలో ఏడు మేడ్చల్ లో ఆరు ఇతర రాష్ట్రాల నుంచి వలసల ద్వారా 12 విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా 4 కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట వికారాబాద్ నల్లగొండ నారాయణపేట్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. దీనితో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1991కు చేరింది.ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారి ద్వారా యాదాద్రి భువనగిరి జగిత్యాల మంచిర్యాల జిల్లాల్లో ఈ వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మొన్నటి వరకు దాదాపుగా తెలంగాణలోని అన్ని జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉన్నట్లే అని భావించిన ప్రభుత్వానికి ఇటు ప్రజలకు తాజాగా బయటపడుతున్న పాజిటివ్ కేసులు భయం కలిగిస్తున్నాయి.

గత 14 రోజులుగా జిల్లాల్లో వైరస్ కేసులు నమోదు కావడం లేదు. కానీ ఒక్కసారిగా నాలుగు జిల్లాల్లో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలంలోని జక్లేర్‌లో నాలుగు నెలల బాలుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. జలుబు దగ్గుతో బాధపడుతున్న ఈ బాలుడిని రెండు రోజుల క్రితం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత మహబూబ్‌నగర్ జనరల్ హాస్పిటల్‌కు పంపించారు. మళ్లీ అక్కడి నుంచి హైదరాబాద్ నిలోఫర్‌కు తీసుకెళ్లారు. అనుమానం వచ్చి ఆ చిన్నారికి మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది.

అటు వికారాబాద్ జిల్లా తాండూరులో ఏడాది బాలుడికి కరోనా సోకింది. ఇటీవల బాలుడి తల్లిదండ్రులు షాద్‌నగర్‌లో జరిగిన ఓ విందులో పాల్గొన్నారు. విందుకు హాజరైన చిన్నారి మేనమామకు కరోనా సోకడంతో బాలుడికి కూడా వైరస్ సంక్రమించింది. ఇదే జిల్లాలో ఏడు నెలల వయసున్న మరో చిన్నారికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరోవైపు జిల్లాల్లో విస్తరిస్తోన్న వైరస్ నేపథ్యంలో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. మొత్తంగా తెలంగాణ లో సెకండ్ వేవ్ మొదలైంది అని జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు.