కాళేశ్వరం ప్రాజెక్టుపై ‘డిస్కవరీ సినిమా’!

Wed Jun 23 2021 12:37:30 GMT+0530 (IST)

Discovery Cinema on Kaleshwaram project

ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఎత్తిపోతల పథకంగా పేరుగాంచిన కాళేశ్వరం ఘనత ఏంటన్నది చాలా మందికి తెలియదు. ఆ ప్రాజెక్టు పేరు తెలిసిన వాళ్లలోనూ.. దాని సామర్థ్యం గురించిన అవగాహన తక్కువే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వింతలు విశేషాలను ప్రపంచానికి వివరించేందుకు సిద్ధమైంది ప్రముఖ ఛానల్ డిస్కవరీ. ఈ మేరకు ‘లిఫ్టింగ్ ఎ రివర్’ పేరిట ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది.‘పనులు ఎవరైనా ప్రారంభిస్తారు.. కానీ కొందరే దిగ్విజయంగా ముగిస్తారు.’ ఇక ప్రభుత్వాలు చేపట్టే ప్రాజెక్టుల గురించి చెప్పాల్సిన పనేలేదు. అలాంటిది.. కాళేశ్వరం వంటి ప్రాజెక్టును కేవలం మూడేళ్లలోనే పూర్తి చేయడం అందరినీ నివ్వెర పరిచింది. అయితే.. ఈ ప్రాజెక్టులో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం మొదలు.. కార్మికుల శ్రమ వరకు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రజలకు వివరించబోతోంది డిస్కవరీ.

ఒక అంశాన్ని తీసుకుంటే.. డిస్కవరీ ఎంత డీప్ గా వెళ్తుందో.. ఆ ఛానల్ చూసేవారికి తెలుసు. పలానా అంశం కవర్ కాలేదు అనే అవకాశమే ఉండదు. ప్రతీ విషయాన్ని ఆది నుంచి అంతం వరకు క్షుణ్నంగా వివరిస్తుంది. ఇప్పుడు కాళేశ్వరం విషయంలోనూ ఇదే చేయబోతోంది. 2016 మే 2న కన్నెపల్లి వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ శంకుస్థాపన చేసింది మొదలు.. ప్రారంభోత్సవం జరిగే వరకు కొనసాగిజన ఈ జల యజ్ఞాన్ని పూసగుచ్చనుంది.

రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తి పోసేలా నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టు కింద 20 పంపు హౌస్ లు నిర్మించారు. ఇందులో వినయోగించే భారీ మోటార్లు ఎక్కడా లేవు. దాదాపు రూఏ.80 వేల కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ ఎత్తి పోతల పథకం ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు డిస్కవరీ ఛానల్ డాక్యుమెంటరీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రాబోతోంది. తెలుగు ఇంగ్లీష్ సహా మొత్తం ఆరు భారతీయ భాషల్లో ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది.