అంబానీ కంటే ఆయన డైరెక్టర్ల శాలరీ ఎక్కువ !!

Sat Jul 20 2019 23:00:01 GMT+0530 (IST)

ముఖేష్ అంబానీ... తండ్రి ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి ఇస్తే దానిని తిరుగులేని స్థాయికి  తీసుకెళ్లిన వ్యక్తి. ఏ వ్యాపారంలో దిగినా విజయమే. టెలికాం రంగంలో రిలయన్స్ జియో వేసిన ముద్ర అసామాన్యమైనది. కేవలం ఒక పెళ్లి కోసం 700 కోట్లు ఖర్చు పెట్టిన ఘనాపాటి.  మరి ఆయన జీతం పదేళ్లుగా రూపాయి కూడా పెరగడం లేదనే విషయం మీకు తెలుసా? 2008-09  ఆర్థిక సంవత్సరం నుంచి నేటికి ఆయన వేతనం ఏడాదికి 15 కోట్లే. ఇదే వింత అనుకుంటే... అతని కంటే అతని డైరెక్టర్లకు ఎక్కువ జీతాలొస్తున్నాయి. అయితే ఆయన తన జీతాన్ని పరిమితంగా తీసుకోవడానికి ఒక కారణముందట. మేనేజియరల్ కంపెన్సేషన్ విషయంలో ఇండస్ట్రీలో ఒక నమూనాలా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఇలా చేస్తున్నారట.ఇదీ ఆయన కంపెనీ జీతాల గుట్టు..
రిల్ (రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్)లో కంపెనీ డైరెక్టర్లకు జీతాలు అలవెన్సులతో పాటు ఫర్ఫామెన్స్ కమిషన్లు ఉంటాయి. అధికారిక లెక్కలప్రకారం  అంబానీ జీతం అలవెన్సులతో కలిపి 4.45 కోట్లు. ప్రోత్సాహకాలు 31 లక్షలు. రిటైర్ మెంట్ బెనిఫిట్స్ 71 లక్షలు ఫర్ ఫామెన్స్ కమిషన్ 9.53 కోట్లు. మొత్తం ఏడాది వేతనం అన్నీ కలిపి 15 కోట్లు.

రిల్ ఇతర డైరెక్టర్లు నిఖిల్ ఆర్ మేస్వాని హితల్ ఆర్ మేస్వానికి ఆయనకంటే జీతం (కమిషన్లతో కలిపి) ఎక్కువ. ఈ ఇద్దరికి ఒక్కొక్కరికి గత ఏడాదికి 20.57 కోట్లు చెల్లించారు. మరో డైరెక్టరు పీఎంఎస్ ప్రసాద్ కు పది కోట్లు చెల్లించారు.

ఇదిలా ఉండగా.. తాజా రిపోర్టులో కంపెనీ ఈ వివరాలు ప్రకటించింది. ఇందులో ఇంకా వారు ఏం చెప్పారంటే... ఫార్చూన్ 500 గ్లోబల్ కంపెనీల్లో రిల్ టాప్ 100 లో ఉందట. అది కూడా ప్రాఫిటబుల్ లిస్టులో ఉంది. నిత్యం మారుతున్న ఆయిల్ ధరల్లోనూ తమ కంపెనీ లాభాలు చవిచూసినట్టు వాళ్లు పేర్కొన్నారు. రిల్ లో రిలయన్స్ రిటైల్ జియో రెండూ కలిపి 25 శాతం వాటా బిజినెస్ ఇస్తున్నాయి. ఈ రిపోర్టు  ప్రకారం ముఖేష్ అంబానీ  ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 13వ స్థానంలో ఉన్నాడు.