Begin typing your search above and press return to search.

రైతు భరోసా నిధుల జమలో తేడాలున్నాయా?

By:  Tupaki Desk   |   16 Oct 2019 7:57 AM GMT
రైతు భరోసా నిధుల జమలో తేడాలున్నాయా?
X
రైతు భరోసా పథకాన్ని భారీ ఎత్తున ప్రారంభించింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎన్నికలు దగ్గరకు వచ్చాకా అటు మోడీ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని ఇచ్చే ప్రణాళికను రచించింది. ఎన్నికలు దగ్గరకు రాగానే చంద్రబాబునాయుడు కూడా పెట్టుబడి సాయం అన్నారు. అయితే అదంతా ఎన్నిక జిమ్మిక్కే. తాము అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయం పథకాన్ని సాగిస్తామని జగన్ ఎన్నికల ముందు ప్రకటించారు.

అందుకు తగ్గట్టుగా.. అధికారంలోకి వచ్చీ రాగానే.. జగన్ ఆ పథకాన్ని అమలు పెట్టారు. ముందుగా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఏడాదికి అని ప్రకటించారు. ఆ తర్వాత రైతు సంఘాల నుంచి వచ్చిన సిఫార్సుల మేరకు మూడు దశల్లో ఆ డబ్బును ఇచ్చే ఏర్పాట్లు చేశారు. అలాగే సాయాన్ని వెయ్యి రూపాయల మేరకు పెంచారు.

ఏడాదికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు - మూడు విడతలుగా ఇచ్చేలా పథకాన్ని ప్రారంభించారు. అందుకు సంబంధించి డబ్బుల జమ కార్యక్రమం మొదలైంది. గతంతో పోలిస్తే ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. దాదాపు పది లక్షల మందికి అదనంగా సాయం అందిస్తున్నారు. అలాగే కౌలు రైతులను కూడా లబ్ధిదారులుగా యాడ్ చేశారు.

ఇదంతా బాగానే ఉంది కానీ - డబ్బుల జమ అవుతున్న తీరులో తేడాలు కనిపిస్తున్నాయని సమాచారం. కొందరు రైతులకు ఈ పథం కిందట నాలుగు వేల ఐదు వందల రూపాయలు యాడ్ అవుతున్నాయని - మరి కొందరికి రెండు వేల ఐదు వందల రూపాయలే యాడ్ అవుతున్నాయని తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో కొన్ని చోట్ల ఈ తేడాలున్నాయట. ఈ విషయంలో రైతులు చర్చించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ఈ పథకానికి ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను అయితే ప్రభుత్వం విడుదల చేసింది. మరి జమలో మాత్రం తేడాలు ఎందుకు వస్తున్నాయి - ఈ విషయంలో పొరపాటు ఎక్కడ - బ్యాంకర్లు ఇలా ఎందుకు తేడాగా జమ చేస్తున్నారు? అనే విషయాలను ప్రభుత్వం సమీక్షించుకోవాల్సి ఉంది.

ఇలాంటి తేడాల వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించాలని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.