Begin typing your search above and press return to search.

అంతర్జాతీయ వేదిక మీద మాజీ ఉప రాష్ట్రపతి అలాంటి వ్యాఖ్యలు చేశారా?

By:  Tupaki Desk   |   29 Jan 2022 5:30 PM GMT
అంతర్జాతీయ వేదిక మీద మాజీ ఉప రాష్ట్రపతి అలాంటి వ్యాఖ్యలు చేశారా?
X
కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం రాజకీయంగా మంట పుట్టించేలా మారింది. మోడీ ఎంట్రీ పుణ్యమా అని దేశంలో జాతీయవాదానికి సరికొత్త అర్థం చెబుతున్న కమలనాథులకు.. మిగిలిన రాజకీయ పక్షాలకు సైద్ధాంతిక పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక అంతర్జాతీయ సదస్సులో మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు విరుచుకుపడుతున్నారు.

హిందూ జాతీయవాదం ప్రబలుతున్న దేశంలో అసహనం.. అభ్రత పెరుగుతున్నట్లుగా హమీద్ అన్సారీ.. అమెరికా చట్ట సభల ప్రతినిధులు కిందరు చేసిన ఆందోళనపై కేంద్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత బుధవారం ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ ఒక సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వక్తులుగా ఉన్న వారు వెలుబుచ్చిన వ్యాఖ్యలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

తాజాగా ఈ సదస్సులో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ‘హమీద్ అన్సారీ అభిప్రాయం తప్పు. మైనార్టీలకు భారత్ కు మించిన సురక్షితమైన దేశం లేదు. ఇరుగుపొరుగు దేశాల మైనార్టీలు కూడా రక్షణ కోరి భారత్ లోకి వస్తున్నారు’ అని పేర్కొన్నారు. మరో కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మరో అడుగు ముందుకు వేశారు. హమీద్ అన్సారీపై నేరుగా వ్యాఖ్యలు చేయకున్నా.. పరోక్షంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. విస్తారమైన.. బలమైన భారత ప్రజాస్వామ్యానికి ఇతరుల సర్టిఫికేట్లు అక్కర్లేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పస్టం చేసింది.

‘కొంతమంది వ్యక్తులు.. సంస్థలు భారత వ్యతిరేక ప్రచారానికి సుపారీ తీసుకున్నట్లుగా ఉందని దేశం భావిస్తోంది’ అని నఖ్వీ వ్యాఖ్యానిస్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్ర తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఉప రాష్ట్రపతి పేరును ప్రస్తావిస్తూ ఘాటు ఆరోపణ చేశారు. ‘‘హమీద్ అన్సారీ తుక్డే తుక్డే గ్యాంగ్ మద్దతుదారులా మాట్లాడుతున్నారు’’ అని వ్యాఖ్యానించటం సంచలనంగా మారింది. ఇక.. ఇదే అంశంపై మోడీ సర్కారులో పని చేస్తున్న పలువురు ప్రముఖులు మాట్లాడారు.

‘మన రాజ్యాంగాన్ని రక్షించాలని ఇతరులు గళమెత్తటం అసంబద్ధం. విపరీత ధోరణి’ అంటూ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతిని అరిందమ్ బాగ్జి మండిపడుతున్నారు. ఈ సదస్సుకు సంబంధించిన వివరాల్ని తాము తెలుసుకున్నామని.. వక్తల పక్షపాత ధోరణి.. రాజకీయ ప్రయోజనాలు కనిపిస్తూనే ఉన్నాయన్నారు. మరి.. ఈ ఎదురుదాడిపై విపక్షాలు ఏ రీతిలో రియాక్టు అవుతాయో చూడాలి.