హైదరాబాద్ రోడ్ల మీద టీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు విన్నారా?

Wed Jul 21 2021 09:23:22 GMT+0530 (IST)

Did the High Court hear key remarks on the roads of Hyderabad?

ప్రభుత్వ విధివిధానాలపైనా.. పని తీరుపైనా.. వైఫల్యాల మీద ఇటీవల కాలంలో న్యాయస్థానాలు మొహమాటం లేకుండా వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యవస్థల్లో కదలిక తీసుకురావటానికి న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేస్తే తప్పించి కదలిక లేకుండా పోతున్న వైనం తాజాగా చోటు చేసుకుంది. ఈ మధ్యనే హైదరాబాద్ మహానగర రోడ్ల మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే.కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి 73 ఏళ్ల గంగాధర తిలక్ తనకొచ్చే పెన్షన్ డబ్బులతో జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లపై గుంతల్ని పూడ్చుతున్నారంటూ ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని సుమోటోగా స్వీకరించిన జస్టిస్ హిమకోహ్లీ.. జస్టిస్ బి. విజయసేన్ రెడ్డిలతో కూడా ధర్మాసనం విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ధర్మాసనం రోడ్ల అంశాన్ని మరోసారి విచారించింది. విచారణ సందర్భంగా జీహెచ్ఎంసీ తీరును తీవ్రంగా తప్పు పట్టారు.

సాధారణ ప్రజలు మాత్రమే కాదు.. రోడ్ల మీద గుంతలతో తాము  కూడా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. వర్షాకాలం ఇప్పటికే ప్రారంభమైందని.. రోడ్లకు మరమ్మతులు చేయటానికి మరెన్ని దశాబ్దాలు కావాలని ప్రశ్నించారు. సాధారణంగా ప్రభుత్వ విభాగాలు తప్పు చేస్తే.. వాటిని వేలెత్తి చూపించటమే కాదు.. తలంటం మామూలే. తాజాగా మాత్రం కుంకుడుకాయ రసం ఘాటు గుర్తుకు వచ్చేలా హైకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి.

హైదరాబాద్ మహానగర పరిధిలోని రోడ్ల నిర్వహణ విషయంలో జీహెచ్ఎంసీ చేపడుతున్న చర్యల గురించి జీహెచ్ఎంసీ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా.. ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. తాము అడిగింది ఒకటైతే.. మీరు మరొకటి చెబుతారేంటని ప్రశ్నించారు. రోడ్లకు మరమ్మతులు చేసేందుకు జీహెచ్ఎంసీ రాత్రింబవళ్లు శ్రమిస్తున్నరని చెప్పారు. టూవీలర్ వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అయితే.. న్యాయవాది వినిపించిన వాదనలపై బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. పొంతనలేని వాదనలు వినిపిస్తున్నట్లుగా పేర్కొంది.

ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యల్లో కొన్నింటిని చూస్తే..

-  ప్రశాసన్‌నగర్‌లోని ఎంపీ ఎమ్మెల్యేల కాలనీతోపాటు వీఐపీలు నివసించే ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజీ అన్నీ బాగున్నాయి. జీహెచ్ఎంసీకి వీఐపీలే ముఖ్యమా? సామాన్య ప్రజలు తిరిగే రోడ్లను మాత్రం మరమ్మతులు చేయకుండా గాలికొదిలేశారు. అంటే సామాన్యుల ప్రాణాలు పోతున్నా పట్టదా? ఆస్తి పన్ను చెల్లించే వారంటే లెక్కలేదా?

-  మేమూ హైదరాబాద్ పౌరులమే. రోడ్ల మీద వెళ్తున్నప్పుడు గుంతలతో మేమూ ఇబ్బందులు పడుతున్నాం. రోడ్లకు మరమ్మతులు చేయడానికి ఇంకా ఎన్ని దశాబ్దాలు కావాలి?

-  హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని ఇక్కడ వసతులు బాగుంటేనే పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకొస్తారు? ఈ సంవత్సరం వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఏం చేశారో చెప్పమంటే.. గత ఏడాది చేసింది చెబుతారేంటి?